ఈడీ చేతికి మెటా!? | - | Sakshi
Sakshi News home page

ఈడీ చేతికి మెటా!?

Oct 17 2025 6:08 AM | Updated on Oct 17 2025 6:08 AM

ఈడీ చేతికి మెటా!?

ఈడీ చేతికి మెటా!?

‘మెటాఫండ్‌’ ప్రధాన

నిందితుడి అరెస్టు

మనీలాండరింగ్‌ జరిగిందంటున్న పోలీసులు

హవాలా లావాదేవీలపై కూపీ

ఒక్క కరీంనగర్‌లోనే రూ.30కోట్లు వసూలు

రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్‌

కింగ్‌పిన్‌ లోకేశ్‌ అరెస్టుతో కేసులో మరింత దర్యాప్తు

వాస్తవరూపం దాల్చిన ‘సాక్షి’ వరుస కథనాలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్‌లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్‌పిన్‌ లోకేశ్వర్‌రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో వాటిని అంగీకరించినట్లయింది.

దుబాయ్‌ హవాలాపై దృష్టి

ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, దుబాయ్‌ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్‌లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్‌డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్‌ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్‌లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్‌ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్‌ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్‌ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్‌ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్‌ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్‌ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరీంనగర్‌క్రైం : మెటాఫండ్‌ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్‌రావు(32)ను కరీంనగర్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్‌ ఆలం కమిషనరేట్‌లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని పీవీఎన్‌కాలనీకి చెందిన వరాల లోకేశ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్‌లైన్‌ బిట్‌కాయిన్‌లో, డిజిటల్‌ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్‌కు చెందిన తులసీ ప్రకాశ్‌ తమ ప్రాంతంలో యూబిట్‌ కాయిన్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్‌, దాసరి రాజు, దాసరి రమేశ్‌, కట్ల సతీశ్‌ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‌‘మెటాఫండ్‌’ రూపొందించి గతేడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో ఓ రిసార్ట్‌లో ఆవిష్కరించారు. యాప్‌ ప్రచారం కోసం కరీంనగర్‌, జగిత్యాల, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్‌కు చెందిన భాస్కర్‌ నాయక్‌ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్‌డ్రా చేయలేని విధంగా యాప్‌ను డిజైన్‌ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్‌ రూరల్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్‌, బూర శ్రీధర్‌, దాసరి రాజు, దాసరి రమేశ్‌, కట్ల సతీశ్‌ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్‌రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్‌ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, సీసీఎస్‌ సీఐ ప్రకాశ్‌ను సీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement