
గుట్టబోర్లు హాంఫట్
జోరుగా మొరం అక్రమ రవాణా
ఆనవాళ్లు కోల్పోతున్న గుట్టలు
పట్టించుకోని అధికారులు
బుగ్గారం: మండలంలోని పలు ప్రాంతాల్లోని గుట్ట బోర్లు కనుమరుగవుతున్నాయి. కొంతమంది మట్టికోసం తవ్వుతుండగా.. మరికొంత మంది స్థలాన్ని కబ్జా చేయడానికి తవ్వుకాలు జరుపుతున్నారు. దీంతో గుట్టబోర్లు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణ సమయంలో.. ఇతర అవసరా లకు ఎక్కడైనా మొరం తవ్వి ఎడ్లబండ్లలో తెచ్చుకుంటే ఎన్నో ఇబ్బందులకు గురిచేసే అధికారులు.. బడాబాబులు, అక్రమార్కులు గుట్టలనే మాయం చేస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. మండలంలోని సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపే ట, బుగ్గారం, చిన్నాపూర్, గోపులాపూర్ పరిధిలోని గుట్టబోర్లను కొంతకాలంగా దర్జాగా తవ్వుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపిస్తున్నారు.
కబ్జా కోసం
మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలలో అటవీశాఖ భూములు ఉన్నాయి. పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే అటవీశాఖ పరిధిలోని గుట్టబోర్లు ఉండడంతో స్థలాన్ని కలుపుకోవాలనే దురుద్దేశంతో కొంతమంది గుట్టలను మాయం చేస్తున్నారు. ఈ స్థలంలోని విలువైన వృక్ష సంపద కనుమరుగుకావడమే కాకుండా ప్రభుత్వ పరిధిలోని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొంత మంది మొరం కోసం గుట్టలను తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగైదేళ్లలో సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, గంగాపూర్, చిన్నాపూర్‌లోని గుట్టబోర్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇటీవల శెకెల్ల శివారులో గుట్టబోరుకు జేసీబీతో రాత్రిపూట మొరాన్ని తవ్వుతున్నారని స్థానికులు సంబధిత అధికారులకు ఫోన్‌లో తెలపగా.. పోలీసులకు ఫోన్ చేయండని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. అదేరాత్రి మరో అధికారికి ఫిర్యాదు చేయగా.. ఆయన స్థానిక అధికారులను పంపించేసరికే అక్రమార్కులు తమ అవసరం మేరకు తవ్వుకుని పోయారు. ఫిర్యాదు చేసిన కొంతకాలం హడావుడి చేస్తున్న అధికారులు తరువాత ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.