
22 తరువాత కొందాం
10 శాతం జీఎస్టీ తగ్గడంతో బైక్, కార్ల కొనుగోళ్లు వాయిదా
ఈనెల 22 తరువాత కొందామంటున్న వినియోగదారులు
కస్టమర్లకు ఏటా రూ.60 కోట్ల వరకు మిగులు
బైక్‌పై రూ.20 వేలు, కార్లపై రూ.60వేల నుంచి రూ.1.50 లక్షల వరకు తగ్గింపు
ప్రస్తుతం నిలిచిన వాహనాల బుకింగ్‌లు, స్తంభించిన వ్యాపారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కారు, బైక్ షోరూంలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. జీఎస్టీ శ్లాబులు తగ్గుతాయని కేంద్రం ప్రకటన దరిమిలా.. ఇప్పటికిప్పుడు బండి (కారు లేదా బైక్) కొందామనుకున్న ప్రతీ ఒక్కరూ వాయిదా వేశారు. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబరు 22 తరువాత అమలులోకి రానుండటంతో కారు, బైకు ల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. మధ్యతరగతికి భారీ ఊరట కానుంది. ప్రతీ బైకుపై కనిష్టంగా రూ.8000 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైనా రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం షోరూముల్లో బుకింగులు నిలిచిపోయాయి. కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి.
సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు కుదుపు
జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో షోరూంల్లోనే కాదు, ఇటు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌పైనా ప్రభావం పడింది. బైకుల ధరలు పెట్రోల్ వేరియంట్లలో రూ.8000 నుంచి రూ.20,000 వరకు తగ్గింపు వర్తించనుండటం, కార్లలో రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గింపు వర్తిస్తుండటంతో ఇంతకాలం సెకండ్ హ్యాండ్ కొందామనుకున్న వారంతా కొత్త బండ్ల వైపు చూస్తున్నారు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెలవెలబోతోంది.
ఆగస్టు 13 నుంచే కటకట
సెప్టెంబరు 3వ తేదీన కొత్త జీఎస్టీ శ్లాబులను కేంద్రం ప్రకటించింది. దాంతో 4వ తేదీ నుంచి షో రూంలు, సెకండ్ హాండ్ మార్కెట్లు బోసిపోతున్నా యి. ఆటోమొబైల్ రంగానికి ఈ కుదుపు ఆగస్టు 13నే తాకింది. ఆ రోజు రాత్రి ప్రతీ వాహనంపై 2శాతం ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరునాటి నుంచి కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15న కేంద్రం జీఎస్టీ విషయంలో దీపావళికి తీపి కబురు చెబుతానడటంతో ఆటోమొబైల్ రంగం ఆందోళన చెందింది. దీపావళి వరకు కొనుగోళ్లు బోసిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 3న ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త ఆఫర్లు.. డిస్కౌంట్లు
ప్రస్తుతం షోరూం నిర్వాహకులు బుకింగ్ చేసుకోవచ్చని డెలివరీ సెప్టెంబరు 22 తరువాతే ఇస్తామని స రికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ.. కొనుగోళ్లు పెంచేందు కు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ పాత వాహనాలను క్లియర్ చేసేందుకు 10శాతం వరకు డి స్కౌంట్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించేందుకు య త్నిస్తున్నారు. అయినా, పెద్దగా కొనుగోళ్లు పుంజుకో వడం లేదని షోరూం నిర్వాహకులు వాపోతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల కొనుగోళ్లు అధికంగానే జరుగుతాయి. మధ్యతరగతి వారు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అంటే దాదాపు 10శాతం వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రతీ 100 సీసీ ఆపై సామర్థ్యం ఉన్న బైకులు రూ.లక్షకుపైనే పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధర రూ.30వేల నుంచి మొదలవుతుంది. వీటికి సైతం 10శాతం జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. ప్రతీ నెలా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల షోరూముల్లో కలిపి దాదాపు 3000కుపైగా బైకులను విక్రయిస్తారు. ఈ లెక్కన ఎలక్ట్రిక్ బైకులపై రూ.3000, పెట్రోల్ బైకులపై రూ.8000 వరకు కనిష్టంగా ధరలు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా నెలకు రూ.2.40కోట్ల వరకు వినియోగదారులకు లబ్ధి చేకూరతుందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు నెలకు 500 నుంచి 550 వరకు కార్లు అమ్ముడుపోతాయి. 1200 సీసీ లోపు సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రతీ నెలా రూ.2.6 కోట్ల చొప్పున ఏటా రూ.31.2 కోట్ల వరకు వినియోగదారులకు కలిసి రానుంది. బైక్, కార్ల కొనుగోళ్లలో ఉమ్మడిజిల్లా కస్టమర్లకు దాదాపుగా రూ.60 కోట్ల వరకు కలిసి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.