
జ్వరాలతో విలవిల
దోమలు వృద్ధి చెందకుండా చర్యలు
ఇంటింటి సర్వే చేపడుతున్నాం
జగిత్యాల: విషజ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా ఇంటింటికీ ఒకరు లేదా ఇద్దరు జ్వరపీడితులు ఉంటున్నారు. వైద్యశాఖ నిత్యం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వైరల్‌ఫీవర్, టైపాయిడ్, మలేరియా, డెంగీతో పలువురు బాధపడుతున్నట్లు వెలుగుచూస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. రెండు మూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలా వాతావరణంలో విపరీతమైన మా ర్పులు చోటుచేసుకోవడంతో చాలామంది అనా రోగ్యాల బారిన పడుతున్నారు. వైద్యాధికారులు ఇంటింటికీ తిరుగుతూ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపడుతున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు 9 రౌండ్లు ఇంటింటికీ సర్వే చేశారు. ప్రస్తుతం 10వ రౌండ్ సైతం ప్రారంభమైంది. అనుమానంగా ఉన్న జ్వర పీడితులను గుర్తించి చికిత్స అందిస్తున్నా.. పట్టణం, పల్లె తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి.
ఆస్పత్రులకు భారీగా పెరిగిన ఓపీ
జిల్లాలో 17 పీహెచ్‌సీలు, ఐదు కమ్యునిటీ హెల్త్‌సెంటర్లు, ఐదు బస్తీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు జిల్లాకేంద్రంలో ప్రధాన ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. పీహెచ్‌సీల్లోనూ ఓపీ వందకు తగ్గడం లేదంటే పరిస్థితి ఎలా ఉందోఅర్థం చేసుకోవచ్చు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న జనం రోగ నిర్ధారణ పరీక్షల కోసం పడిగాపులు కాస్తున్నారు. వైద్యాధికారులు సర్వే చేపట్టి అనుమానితులను ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 2,50,648 ఇళ్లలో పరిశీలించారు. మొత్తం 5,900 లార్వాలను గుర్తించి అభివృద్ధి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 2,429 టైర్లను తొలగించారు. 44,706 కూలర్లు, 65,717 డ్రమ్ములు, 67,566 సిమెంట్ గాజులు, 42,814 కుండలు, ప్లాస్టిక్ తొలగించారు. లార్వాలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నా.. రోగాలు తగ్గడం లేదు. ఇంటింటికీ ఒకరిద్దరు జ్వర పీడితులున్నారు.
ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువు దోమ
ప్రజారోగ్యానికి దోమలే ప్రధాన శత్రువుగా మా రాయి. ఇవి వృద్ధి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. డెంగీ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా డ్రమ్ములు, నీటి తొట్టెలు, వాడిన టైర్లలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. మలేరియా జ్వరం ఆడ అనాఫిలస్ దోమకాటుతో వస్తుంది. ఇవి ఎక్కువగా మంచినీటిలోనే పెరుగుతాయి. మెదడు వాపు క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది. ఎక్కువగా పంట పొలాల్లో పెరుగుతాయి.
వ్యక్తిగత పరిశుభ్రతతోనే..
ప్రతిఒక్కరు ఇంటి ఆవరణ, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతోపాటు, ప్రతి రోజు డ్రైడే పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ గానీ, వాడిన ఆయిల్ చల్లితే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండదు. ఇంట్లో తప్పనిసరిగా దోమ తెరలు వాడాలి. దోమల నివారణకు 2.5 ఎంఎల్ టెమిపాస్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వర్షపునీటి కుంటల్లో చల్లాలి. కొన్ని వ్యక్తిగత చర్యలు పాటిస్తే దోమలు దరిచేరకుండా ఉండటంతో పాటు జ్వరాలు అరికట్టవచ్చు.
ప్రతిరోజు గ్రామాలు, ము న్సిపాలిటిల్లో తిరుగుతూ దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ డ్రమ్ములు, పాత టైర్లు, కొబ్బరిబొండాలలో నిల్వ ఉన్న నీటిని గుర్తిస్తూ ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమన్వయంతో వాటిని తొలగిస్తున్నాం.
– శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో
జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నాం. ఇప్పటివరకు 9 రౌండ్లలో 2,50,648 ఇళ్లను సర్వే చేపట్టాం. అనుమానితులను గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతతోనే జ్వరాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దోమలను నివారించాలి.
– ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో

జ్వరాలతో విలవిల

జ్వరాలతో విలవిల

జ్వరాలతో విలవిల

జ్వరాలతో విలవిల

జ్వరాలతో విలవిల