
ఉపాధ్యాయులు సాంకేతికతతో బోధించాలి
జగిత్యాల: ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికత జోడించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 60మందికి పురస్కారాలు అందించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు ఉన్నత స్థానాలకు చేర్చుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, పదోన్నతి కల్పించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటర్‌నేషనల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. జిల్లాకు ఏటీసీ మంజూరు చేశామన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందించడం గర్వంగా ఉందన్నారు. తండ్రి ఆస్తి అందిస్తే గురువు జ్ఞానాన్ని అందిస్తారని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు పొందాలన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఈవో రాము, అధికారులు పాల్గొన్నారు.
కోటిలింగాల అభివృద్ధికి సహకరించండి
వెల్గటూర్: కోటిలింగాల ఆలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఆలయ కమిటీ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆలయానికి నిధులు కేటాయించాలని ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి తదితరులు కోరారు.
బుగ్గారం అభివృద్ధికి కృషి
బుగ్గారం: నూతనంగా ఏర్పడిన బుగ్గారం మండలాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి అన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు రానీయబోనని, ధాన్యం కొనుగోలు కోసం త్వరలోనే ప్రత్యేక స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. అనంతరం కొందరు కాంగ్రెస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై వినతి
ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంత్రికి విన్నవించారు. 1992 తదుపరి అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి అత్రం భుజంగరావు, భోగ రమేశ్, జిల్లా అధ్యక్షులు రామ్‌చంద్రం, ప్రధానకార్యదర్శి గోవర్ధన్ తదితరులున్నారు.

ఉపాధ్యాయులు సాంకేతికతతో బోధించాలి