
మొదట ఎక్కిరించిన్రు
సాక్షి, కరీంనగర్ డెస్క్: మా సొంతూరు ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంం. అమ్మానాన్న అన్నవరం దశరథ–కేదారమ్మ. 1962 అక్టోబర్ 17న పుట్టిన. ఉపాధ్యాయిని ఏదునూరి రాజేశ్వరితో వివాహమైంది. కూతురు స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. పంచాయతీరాజ్‌శాఖ, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్‌లో చాలా కాలం పనిచేశా. ముస్తాబాద్ మండల ప్రజాపరిషత్‌లో సూపరింటెండెంట్‌గా 2020 అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ చేసిన. 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా కొనసాగుతూ, తెలంగాణ పదాలతో కవిత్వం, రచనలు చేసిన. 25 ఏళ్లుగా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న. ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు, రెండు వ్యాస సంకలనాలు వెలువరించా. నా సాహితీకృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి ‘దాశరథి సాహితీ పురస్కారం’ ప్రకటించింది. ఈనెల 22న రవీంద్రభారతిలో దాశరథి శతజయంతి ఉత్సవసభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్న.
● 2001లో సాహితీ సృజన షురూ..
2001లో ‘తొవ్వ’తో కవిత్వ రచనకు తొవ్వ దొరికింది. 60 ఏళ్ల కింద ఊరిలో ఉన్న మానవసంబంధాలు, వస్తువు(ఇసిరె)లు ఎలా ఉండే అనే దానిపై మూడేళ్లపాటు కాలమ్స్ రాశా. అన్ని కలిపి ‘తెలంగాణ జీవనచిత్రిక’ అనే ట్యాగ్‌లైన్‌తో పుస్తకం వేసిన. దానికి తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి అవార్డు వచ్చింది. ఓ పత్రికలో మూడున్నరేళ్లపాటు అంతరంగాలు అనే కాలమ్ రాసిన. మనుషులకు సంబంధించిన జీవనచిత్రన రాయగా, దాన్ని కూడా పుస్తకంగా తీసుకొచ్చిన. గిన్నెసాహితీ అకాడమీ వారు కవిసంధి కార్యక్రమాన్ని కరీంనగర్‌లో నిర్వహించి ఇక్కడ నన్ను ఎంపిక చేశారు. నా కవిత్వ ప్రయాణాన్ని గంట సేపు ప్రసంగం కవిత్వంలో చెప్పాను.
● 12 కవితా సంపుటాలు..
12 కవితా సంపుటాలు వెలువరించా. ఈ 12 కలిపి రెండు బృహత్ సంకలనాలు తీశాను. మూడు పుస్తకాలు ఇంగ్లిష్‌లోకి అనువాదమయ్యాయి. గతంలో పత్రికల్లో రాసిన వ్యాసాలను కలిపి ‘మరో కోణం’ అనే వ్యాస సంపుటిని తీసుకొచ్చాను. ‘ఊరి దస్తూరి’, ‘అంతరంగం’, ‘సంచారం’ పుస్తకాలు వెలువరించా. నాకు వివిధ ప్రాంతాలను సందర్శించడం అలవాటు. అలా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం గురించి కవిత్వంలో లేదా వ్యాసంలోనైనా రాయడం నాకు అలవాటు. ప్రతీ దాని గురించి రాయడమనేది కవికి, రచయితకు అలవాటుగా ఉండాలి. ఈ అక్టోబర్‌లో నా పుట్టినరోజు సందర్భంగా మరో కవితాసంపుటిని వెలువరిస్తా. 2001 నుంచి ప్రతీ అక్టోబర్‌లో ఒక సంకలనం తీసుకురావాలని నిర్ణయించుకున్నా. అదే కొనసాగిస్తున్న.
● అవార్డులు రావడంపై..
అవార్డులు అనేవి కవి, రచయితకు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. మన రచనలను బట్టి అవార్డులు, గుర్తింపు దక్కుతుంది. కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి మా తరానికి ఆదర్శం. ఎప్పుడైనా అవార్డులు బాధ్యతను పెంచుతాయి. దాశరథి సాహితీ పురస్కారం రావడం గౌరవంగా భావిస్తా. ఆయన స్ఫూర్తితోనే నేను రచనలు చేస్తున్నాను.
● ఇంగ్లిష్ ప్రభావంతో..
ఇంగ్లిష్ ప్రభావంతో తెలుగు, తెలంగాణ యాస, భాషలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాలను పుస్తకాల్లో పెట్టింది. కానీ మన ప్రజలు మాట్లాడే భాషలో లేదు. వాటిని తెలంగాణ మాండలికంలో తీసుకొస్తే భవిష్యత్ తరాలకు మన భాషను చేర్చినట్లు అవుతుంది. ప్రభుత్వం కూడా ప్రాథమిక స్థాయి వరకు పాఠశాలల్లో తెలంగాణ భాషలోనే బోధించాలి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రోత్సహించాలి. తెలంగాణ పదాలను బతికించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నిత్య అధ్యయనంతోనే కవిత్వం రాయగలం. అంతకుముందు ఉన్న సాహిత్యాన్ని చదవడం వల్లే మళ్లీ కొత్తగా వివిధ అంశాలపై రాయగలుగుతాం. భాష, ఊరు, అణగారిన సామాజిక వర్గాల మీద ప్రేమ ఉండాలి. అప్పుడే కొత్తగా రచనలు చేయగలం. నాకు స్ఫూర్తినిచ్చిన కవులు శ్రీశ్రీ మహాప్రస్తానం చదివిన తర్వాత కవిత్వం రాయాలనే ఆలోచన వచ్చింది. తర్వాత శివసాగర్, వరవరరావు, చెరబండ రాజు, గోపి, సినారె, శివారెడ్డి రచనలు నాపై ప్రభావం చూపాయి. వారి స్ఫూర్తితో నాదైన ప్రత్యేక శైలిలో రచనలు చేశాను.
● మన సంస్కృతిపై ఉత్తారాది దాడి..
బతుకమ్మ, బోనాలలో కొత్తకొత్త సంప్రదాయాలు వస్తున్నాయి. అయితే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొత్త పోకడలు వస్తున్నాయి. బతుకమ్మ ఆట ఒకప్పుడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఆడేవారు. ఇప్పుడు డీజే సౌండ్లతో ఆడుతున్నారు. ఉత్తరాది కల్చర్‌తో మన బతుకమ్మ ఆగమైంది. బతుకమ్మ ఆటపై దాండియా దాడి చేసింది. అలాగే మన వంటలు, తినే ఆహారంలోనూ మార్పు వచ్చింది. ఉత్తరాదికి చెందిన పానీపురి మన ప్రాంతానికి వచ్చింది. మన సర్వపిండి రాజస్థాన్‌లో ఎవరూ తినరు కదా. ఇడ్లీ తమిళనాడు నుంచి వచ్చింది. మనం కొంచెం బానిస మనస్తత్వంతో బతుకుతాం. మనకు తెలువకుండా ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాం. దీన్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంది.
● పంటలు.. ఉపాధి కారణంగానే..
మన దగ్గర విస్తారమైన పంటలు, ఉపాధి ఎక్కువగా దొరకుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలకు మనవాళ్లు అలవాటు పడుతున్నారు. కానీ, ఇక్కడికి బతకడానికి వచ్చిన మార్వాడీలు, ఉత్తరాది రాష్ట్రాలవారు మన కల్చర్‌ను అలవాటు చేసుకోరు. పత్రికలు కూడా రాజకీయపార్టీల వైపు వెళ్లడంతో సమాజాన్ని అప్రమత్తం చేసే, చైతన్యం చేసే బాధ్యతను మరిచిపోయాయి. పౌరసంఘాలు కూడా తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది.