క్యాన్సర్‌ సోకిందని మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ సోకిందని మహిళ ఆత్మహత్య

Jul 30 2025 6:54 AM | Updated on Jul 30 2025 6:54 AM

క్యాన్సర్‌ సోకిందని  మహిళ ఆత్మహత్య

క్యాన్సర్‌ సోకిందని మహిళ ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల ): క్యాన్సర్‌ వ్యాధి వచ్చిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని దుమాలకు చెందిన పిల్లి మానస(38) ఇటీవల అనారోగ్యానికి గురైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. క్యాన్సర్‌ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోంది. ఈక్రమంలో మనస్తాపంతో సోమవారం రాత్రి అధిక మొత్తంలో ఐరన్‌ ట్యాబెట్లు మింగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త రామచంద్రం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చికిత్స కోసం ఖర్చులు ఎక్కువగా అవుతుండడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త రామచంద్రం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతి

సైదాపూర్‌: మండలంలోని సోమారంలో తాటిచెట్టు పైనుంచి జారిపడిన గీత కార్మికుడు దాసారపు సదానందం(54) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారంగా.. సదానందం ఈనెల 15న గ్రామపరిధిలో కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు.

రోడ్డు ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి..

కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్‌ ఇన్‌ గేట్‌ సమీపంలో సోమవారం బైక్‌ ఢీకొని తీవ్రంగా గాయపడ్డ షేర్‌దార్‌ వెంకటేశ్‌ (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్‌ బస్టాండ్‌ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామానికి చెందిన ముంజం కార్తీక్‌ అనే వ్యక్తి తన బైక్‌పై అతి వేగంగా వచ్చి వెంకటేష్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాత్రి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వెంకటేశ్‌ తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

పాత నేరస్తుల బైండోవర్‌

జగిత్యాలక్రైం: పట్టణంలోని పాత కేసుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను పట్టణ సీఐ కరుణాకర్‌ మంగళవారం జగిత్యాల అర్బన్‌ తహసీల్దార్‌ రాంమోహన్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన కొత్తకొండ వినీత్‌సాయి, జువ్వాడి దీక్షిత్‌, మర్రి మల్లికార్జున్‌, పాల రాజ్‌కుమార్‌, బుర్ర వినయ్‌, పూరెల్ల వినయ్‌ పాత కేసుల్లో నేరస్తులని, ప్రజలను భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వీరిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

యువతి అదృశ్యం

కొడిమ్యాల: మండలంలోని బొల్లంచెరువు గ్రా మానికి చెందిన ఓ యువతి (19) సోమవారం రాత్రి తన ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని యువతి తల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

130 గ్రాముల గంజాయి పట్టివేత

ధర్మపురి: పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడి వద్ద 130 గ్రాముల గంజాయి పట్టుబడిందని ధర్మపురి ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక పోలీసులు మండలంలోని రాయపట్నం శివారులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద 130 గ్రాముల గంజాయి లభించింది. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు

చొప్పదండి: జవహర్‌ నవోదయ 2026–27 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువు తేదీని ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ మంగతాయారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 13న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement