ఎక్కడి పనులు అక్కడే..
● ఈచిత్రంలో కనిపిస్తున్నది సమీకృత మార్కెట్ భవనం. వెజ్, నాన్‌వెజ్ విక్రయాలు అన్నీ ఒకేచోట సాగేలా ఖాదీ ప్రతిష్ఠాన్‌కు చెందిన స్థలంలో మూడేళ్ల క్రితం దీనిని నిర్మాణం చేపట్టారు. ఏడాదిన్నర క్రితం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులు నత్తే నయమన్నట్లుగా సా..గుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా మొదలు పెట్టిన పలు పనులు.. అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. తిరిగి వాటిని పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. వీటిని పూర్తి చేసే విషయంలో ప్రభుత్వాలు వ్యవహారిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బిల్లులు రాక..నిధులు సరిపోక..
● మౌలిక వసతులను కల్పించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లాది నిధులు మంజూరు చేసింది.
● ఆ నిధులతో చేపట్టిన సమీకృత మార్కెట్, షాదీఖానా, ప్రభుత్వాసుపత్రి, జూనియర్ కళాశాల, ఉర్దూ ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్‌ల భవనాల పనులు కొంతవరకు పూర్తయ్యాయి.
● వీటిలో కొన్నింటికి సంబంధించి బిల్లులను నాటి ప్రభుత్వం నుంచి రాకపోవడం.. మరికొన్నింటికి కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసినట్లు తెలిసింది.
● అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించలేదు. దీనివల్ల ఆ పనులు ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కావడం లేదు.
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సంజయ్
● పెండింగ్‌లో ఉన్న పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకపోయారు.
● సమీకృత మార్కెట్‌తో పాటు ఆసుపత్రి, విద్యా సంస్ధల భవనాల పనులు నిధుల కొరత వల్ల చాలా కాలంగా నిలిచిపోయాయని, వెంటనే వాటికి నిధులను మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
● కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ ఒక్కదానికి కూడా నిధులను మంజూరు చేయకపోవడం గమనార్హం.
వసతులు లేక తప్పని తిప్పలు
● ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి నిర్వహిస్తున్న పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. మరోవైపు అందులో ఉన్న గదులు సరిపోక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● కూరగాయల విక్రయాలకు ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రహదారులకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లోనే అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు.
● ఉర్దూ ఉన్నత పాఠశాల కొత్త భవన పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గదులు సరిపోక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
● షాదీఖానా పూర్తయితే పేద ముస్లింలు శుభకార్యాలు, ఇతరత్రా జరుపుకోవడానికి ఎంతో ఉపయోగపడుతోంది. కానీ ఇది పూర్తికాక ఏళ్లుగా వారికి నిరాశే ఎదురవుతోంది.
ఇది పట్టణంలోని బీడీ కాలనీలో నిర్మిస్తున్న షాదీఖానా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో దీనికి అవసరమైన స్థలం కేటాయించారు. తర్వాత 2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేసింది. కానీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదు.
ఎక్కడి పనులు అక్కడే..


