హర్ముజ్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన | What Is Trump Hormuz Project Freedom? Will Iran Cooperate With That? | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

May 4 2026 7:40 AM | Updated on May 4 2026 8:36 AM

What Is Trump Hormuz Project Freedom? Will Iran Cooperate With That?

పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్‌ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్‌లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. 

ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్‌ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్‌ ట్రూత్‌లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. 

ఏం చేస్తారంటే.. 
ట్రంప్‌ చెప్పిన వివరాల ప్రకారం..  ప్రాజెక్టు ఫ్రీడమ్‌ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్‌ ఈస్ట్‌ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.  మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్‌ చేపడుతున్నామని..  ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్‌ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది.  వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. 

సీ ఆపరేషన్‌కు ఇరాన్‌ సహకరిస్తుందా?
హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్‌ మార్కెట్‌ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్‌ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్‌ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో  "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో  ప్రాజెక్టు ఫ్రీడమ్‌లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

ఇరాన్‌ ఏమందంటే.. 
ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను మానవతా చర్యగా ట్రంప్‌ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్‌ అభివర్ణిస్తోంది. హర్ముజ్‌ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్‌(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. 

ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్‌పై సెటైర్లు వేశారు. హర్ముజ్‌ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్‌ సోషల్‌ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్‌ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్‌ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement