
‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని కొన్ని దశాబ్దాలకిందట ఆక్రోశించాడు ఓ సినీకవి. ఈ జెనరేషన్ కుర్రాళ్లంతా ఇంతే.. ఏదీ పట్టదు,, పక్కవాళ్ల గురించి పట్టించుకోరు.. సమాజం గురించి ఆలోచించారు.. తమ సొంత ప్రపంచంలోనే ముడుక్కుని ఉండిపోతుంటారు.. అని విలపించేవాళ్లు, మనకు ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంటారు. కానీ.. యువతరం గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే! వారిలో చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సజీవంగానే ఉంది. ఉంటుంది. కాకపోతే.. దానిని జ్వాలగా రాజేసే సరైన నిప్పుకణిక ఉన్నప్పుడు.. జ్వాలలు రేగుతాయి. ప్రభుత్వాలలోనూ వేడిపుట్టిస్తాయి.
‘సోషల్ మీడియా’ అనే పదం వినగానే చాలామంది ఏదో బూతు పదాన్ని విన్నట్లుగా మొహం గంటు పెట్టుకుంటారు. ఇక యువతరం విషయంలో అయితే- సోషల్ మీడియా అనేది వారిని సమూలంగా సర్వనాశనం చేస్తున్న విషపురుగు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటల్ని ఏకపక్షంగా సమర్ధించలేం. కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేస్తున్న వెర్రి తలలు ప్రతిరోజు వార్తల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖల రూపాలు వాడుక లోకి రావడం ప్రమాదకరమైన సంకేతం.
అదే సమయంలో యువతరానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు గురించి కూడా గమనించాలి. నేపాల్ వంటి దేశాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో యువతరం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతూ వస్తోంది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా అనేకులు. అలాంటి వారందరికీ స్వదేశంలోని తమ సొంత వాళ్లతో కనీసం అప్పుడప్పుడు అయినా మాట్లాడుకోవడానికి, అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారికి దొరికే ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమే. నేపాల్ లో మరీ దారుణంగా వాట్స్అప్ యూట్యూబ్ వంటి వాటిని కూడా నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు పెద్ద అగ్నిజ్వాలలనే పుట్టించాయి. యువతలో పెల్లుబికిన ఆగ్రహాన్ని అణచివేయడానికి ప్రభుత్వం మిలిటరీని ప్రయోగించడం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకుంది. ప్రధాని ఓలి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆగ్రహజ్వాలలు సర్కారీ పెద్దల భవనాలకు అంటుకుని.. ప్రాణాలనూ బలితీసుకున్నాయి. ఇంకా చాలా చాలా జరిగాయి.

స్థూలంగా గమనించినప్పుడు.. తొలుత అనుకున్న సంగతిని మనం సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇవాళ్టి యువతరం నిజంగానే నిస్తేజంగా ఉంటున్నదా? పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి వారిలో కొరవడిందా? అలాంటి సందేహాలకు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అవన్నీ యువతరంలో సజీవంగానే ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని ప్రదర్శించడానికి యువతరం ఏమాత్రమే వెనుకాడే పరిస్థితి లేదని ఈ నేపాల్ దృష్టాంతం నిరూపిస్తోంది. పదిహేనేళ్ల కిందటి మధ్యప్రాచ్య దేశాలను కుదిపేసిన ఉద్యమం అరబ్ స్ప్రింగ్ ను ఇది గుర్తుకు తెస్తోంది. 2011లో టునీషియాలో సోషల్ మీడియా అణచివేతకు వ్యతిరేకంగా రాజుకున్న పోరాటం ఈజిప్టు నుంచి లిబియా వరకు అన్ని దేశాలను కుదిపేసింది. నేపాల్ ఇవాళ అదే పునరావృతం అయింది. జెన్ జీ యువతరం సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది.

యువతరంలో పోరాట స్ఫూర్తి లేదని అనుకోవడం సరికాదు. సోషల్ మీడియాకు యువత వ్యసన పరులు అయ్యారని, అందువల్లనే వారంతా ఇలాంటి తిరుగుబాటుకు ఒడిగట్టారని ఏకపక్షమైన వాదన సరికాదు. రోడ్డు మీదికి వచ్చి పోరాడిన వాళ్లు, ప్రాణాలు అర్పించిన వాళ్లు కేవలం రీల్స్ చేసుకోవడం మీదనో, చూడడం మీదనో మోజు ఉన్నవాళ్లు మాత్రమే కాదు. ఇలాంటి నిషేధాజ్ఞలతో వ్యక్తి స్వేచ్ఛను హరించేయాలని అనుకుంటున్న నియంతృత్వపు పోకడలను ఈసడించుకున్న వాళ్లు మాత్రమే అనేది గుర్తించాలి. స్వేచ్ఛ పట్ల ఇవాళ్టి యువతరంలో ఉండే మమకారాన్ని తెలుసుకోవాలి.
నిజానికి నేపాల్ లో చెలరేగిన తిరుగుబాటు, విధ్వంసకాండ.. భారతదేశంలోనూ అనేక రాష్ట్రాల పాలకులకు కనువిప్పు కలిగించాలి. నిషేధాల వంటి జోలికి ఇక్కడి పాలకులు ఇంకా దృష్టి సారించడం లేదు. సోషల్ మీడియాను తాము కూడా వాడుకుంటున్నారు. కాకపోతే.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు ఈ చట్టాలను, సోషల్ మీడియా బూచిగా వాడుకుంటున్నారు. పాలకుల, ఇలాంటి దుర్మార్గపు పోకడలు కామన్ మ్యాన్ కు కూడా ఏదో ఒక రోజున ఆగ్రహం తెప్పిస్తాయి. అలాంటప్పడు.. ఆ ప్రభుత్వాలు భస్మీపటలం కాక తప్పదు. నేపాల్ తరహా తిరుగుబాటు ఇక్కడ వస్తుందని కాదు.. కానీ.. ప్రజాస్వామికంగానే ఆ పతనం నిర్దేశం అవుతుంది.
:::ఎం. రాజేశ్వరి