పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తలబిరుసు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అటు భారత్, ఇటు ఆఫ్గానిస్థాన్ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధం చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ (khawaja asif) అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు, ఉత్తుత్తి మాటలకు పెట్టింది పేరు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైతం భారత్‌పై ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన పాకిస్థాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ పడమర దిక్కున భారత్‌తో, తూర్పు దిక్కున అఫ్గానిస్తాన్‌తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు.
''తొలిరౌండ్‌లో అల్లా మాకు సహాయం చేశారు. రెండో రౌండ్‌లోనూ ఆయన మాకు అండగా ఉంటార''ని తెలిపారు. కాబూల్‌లోని పాలకులు తలచుకుంటే పాకిస్థాన్ లోని టెర్రరిజాన్ని ఆపవచ్చు కానీ వారు అలా చేయడం లేదని.. దీనికి తగిన రీతిలో బదులిస్తామని హెచ్చరించారు. మంగళవారం పాకిస్థాన్‌లో జరిగిన బాంబుదాడిలో 12 మంది మరణించారు. అది తమ చర్యేనని పాకిస్థాన్ తాలిబన్ గ్రూప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖండించిన భారత్
అయితే ఖవాజా తాజా వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆసిఫ్ తన వ్యాఖ్యలతో పరిస్థితుల నుంచే తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన స్వరం ఇస్లామాబాద్ భయాన్ని తెలియజేస్తోందన్నారు. ఇటీవల భారత్ లో జరిగిన ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ విషయంలో సైతం ఖవాజా ఆసిఫ్ తలబిరుసుగా మాట్లాడారు. ఆ ప్రమాదం గ్యాసు లీకు వల్ల జరిగిందని, ఆ దాడిని భారత్ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. పేలుడు పదార్థాల వల్లే ఎర్రకోట కారు పేలుళ్లు జరిగాయని ఫోరెన్సిక్ నివేదికలు ఇచ్చిన సంగతి తెలిసిందే.


