ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!

Victoria Police Arrest Old Woman On Her Birthday Viral - Sakshi

జీన్‌ బికెంటన్‌. ఆస్ట్రేలియాకు చెందిన వందేళ్ల బామ్మగారు. కొన్నేళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. అయినవాళ్ల నడుమ తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్‌ జోష్‌గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. అందరూ చూస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు. కానీ, షాకవ్వాల్సింది పోయి బామ్మగారు చప్పట్లు కొడుతూ సంబరపడిపోయారు. పైగా ఆహూతులంతా ఆమెతో శ్రుతి కలిపారు. ఎందుకంటారా? ఎందుకంటే జరిగింది ఉత్తుత్తి అరెస్టే కాబట్టి. పోలీసులు వేసినవీ ఉత్తుత్తి సంకెళ్లే కాబట్టి. అసలు సంగతేమిటంటే జీవితంలో ఒక్కసారైనా ఒక్కసారన్నా అరెస్టు కావాలన్నది ఈ బామ్మగారి చిరకాల వాంఛ.

ఈ విచిత్రమైన కోరికను విక్టోరియా పోలీసులు ఇలా తీర్చారన్నమాట. పైగా బామ్మ కోరిక మేరకు పుట్టినరోజు నాడే అరెస్టు చేసి మరింత సంతోషపెట్టారు. తర్వాత కలిసి ఇలా ఫొటోలు దిగి సందడి చేశారు. విక్టోరియా పోలీసు శాఖ వాటినిలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘అరెస్టయితే ఎలా ఉంటుందో చూడాలన్నది బామ్మగారి చిరకాల కోరిక అని తెలియడంతో దాన్నిలా తీర్చాం. దాంతో ఆమె చెప్పలేనంత ఆనందపడింది. ఇది మాకూ సరదాగానే అన్పించింది’’ అని చెప్పుకొచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంది. పోలీసుల స్పందన వారి మనసు దోచుకుంది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్‌కు అద్దం పట్టిందంటూ కామెంట్లు పెట్టారు. పుట్టిన రోజునాడు పెద్దావిడకు గొప్ప కానుక ఇచ్చారంటూ కొందరు మెచ్చుకున్నారు. అన్నట్టూ ఈ బామ్మగారు ఆర్మీలో నర్సుగా సుదీర్ఘకాలం పని చేసి రిటైరయ్యారట. తన చిరకాల కోరికను జీవిత చరమాంకంలో మొత్తానికిలా తీర్చుకున్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top