గ్రీన్‌కార్డు కోసం అమెరికాలో ఉంటూ దరఖాస్తు చేసుకోవచ్చు
యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుల విషయంలో కొత్త నిబంధనల పట్ల తీవ్ర విమర్శలు రావడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు) కోసం చేసుకున్న దరఖాస్తు సమీక్ష దశలో ఉన్నప్పుడు.. దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదని యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) విభాగం వెల్లడించింది.
గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా స్వదేశానికి తిరిగివెళ్లాలని యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అసాధారణ పరిస్థితుల్లో మినహా.. అమెరికాలో శాశ్వత నివాసిత హోదా కోరుకునే విదేశీయులు దరఖాస్తు, ప్రాసెసింగ్ సమయంలో స్వదేశాల్లోనే ఉండాలని ఆదేశిస్తూ మే 21వ తేదీన ప్రకటన జారీ చేసింది. దీనిపై వలసదార్లు, అమెరికా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి.
గ్రీన్‌కార్డు జారీ విధానంలో ఎలాంటి సమూల మార్పు జరగలేదని డీహెచ్‌ఎస్ ప్రకటించింది. ఒక దరఖాస్తుదారుడు అమెరికా వెలుపల నుండి గ్రీన్‌కార్డు ప్రక్రియను పూర్తి చేయాలా? లేక అమెరికాలోనే ఉండాలా? అనే విషయాన్ని కేసుల వారీగా పరిశీలించి నిర్ణయించే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎప్పటినుంచో ఉందని గుర్తుచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ ప్రకారం.. అర్హులైన వలసదారులు ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’అనే ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసిత హోదా కోసం అమెరికాలో ఉంటూనే దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు అమెరికాలోనే నివసించవచ్చు.
స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా, గ్రీన్‌కార్డు కోరుకునే వ్యక్తులు దరఖాస్తు, ఆమోద ప్రక్రియ సమయంలో స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది ‘‘తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోరుకునే విదేశీయులు దరఖాస్తు చేసుకోవడానికి ఇకపై స్వదేశానికి తిరిగి వెళ్లాలి’’అని ఆయన స్పష్టంచేశారు.
వలసదార్లు వారి స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకున్నప్పుడు, అది తిరస్కరణకు గురైతే వారికి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ఒకవేళ అమెరికాలో ఉండి దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే వారు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లుగా గుర్తించాల్సి వస్తుందని తెలిపారు. వారిని వెతికిపట్టుకొని బయటకు పంపించే ప్రయాస కూడా తమకు తప్పుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనను వలసదార్లు తప్పుపట్టారు. విదేశీ కారి్మకులపై ఆధారపడిన అమెరికా కంపెనీలు కూడా మండిపడ్డాయి. దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


