చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!  | USA-Iran talks in Islamabad failed, Explained in 5 points | Sakshi
Sakshi News home page

చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు! 

Apr 13 2026 4:37 AM | Updated on Apr 13 2026 4:37 AM

USA-Iran talks in Islamabad failed, Explained in 5 points

అమెరికా, ఇరాన్‌ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...

1. అటు అమెరికా, ఇటు ఇరాన్‌ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్‌కు ఇరాన్‌ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.

2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్‌ బృందం పాక్‌లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్‌ బృందం నిలదీసినట్లు సమాచారం.

3. కాల్పుల విరమణ లెబనాన్‌కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్‌ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్‌కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్‌పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్‌ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్‌ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్‌ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.

4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్‌ డిమాండ్‌చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్‌ తమకు కీలక ఆయుధమని ఇరాన్‌ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్‌ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్‌ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్‌ను తెరవాలంటే ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్‌ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్‌ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్‌తో కలిసి టోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్‌ ప్రతిపాదనలను ఇరాన్‌ అంగీకరించలేదు. హార్మూజ్‌పై తమతో పాటు ఒమన్‌ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్‌ డిమాండ్‌కు అమెరికా ఒప్పుకోలేదు.

5. అమెరికా, ఇరాన్‌     బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్‌ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.

ఇక ఏం జరగనుంది? 
చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్‌ మళ్లీ ఇరాన్‌పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్‌పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్‌ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్‌లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది.             

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement