చర్చలపై ప్రతిష్టంభన!  | USA and Iranian delegations are set to meet in Islamabad for peace talks | Sakshi
Sakshi News home page

చర్చలపై ప్రతిష్టంభన! 

Apr 11 2026 4:45 AM | Updated on Apr 11 2026 6:24 AM

USA and Iranian delegations are set to meet in Islamabad for peace talks

రెండు వర్గాలుగా విడిపోయిన ఇరాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు  

నేడు ఇస్లామాబాద్‌ చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం  

లెబనాన్‌పై దాడులు ఆపితేనే చర్చలంటున్న మరో వర్గం 

పాకిస్తాన్‌కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌  

ఇరుపక్షాలను స్వాగతించడానికి సిద్ధమైన పాక్‌ సర్కార్‌  

ఇస్లామాబాద్‌: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడమే ధ్యేయంగా శనివారం పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరాన్‌ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్‌ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. 

మొత్తానికి శాంతి చర్చలకు ఇరాన్‌ హాజరవుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది. శుక్రవారం రాత్రి వరకూ ఎటూ తేల్చుకోకపోవడం గమనార్హం. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధమవుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శుక్రవారం ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల పట్ల ఇరానియన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్నేహహస్తం అందిస్తామని తెలిపారు. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తదుపరి పరిణామాలు మరోలా ఉంటాయని తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. చర్చల విషయంలో ట్రంప్‌ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్‌ వెల్లడించారు.  

రెండు అంశాలు పరిష్కారమైతేనే...  
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఇరాన్‌ ప్రతినిధి బృందం రాకపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

 లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్‌ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని టెహ్రాన్‌ హెచ్చరించినట్లు ఇరాన్‌ అధికారిక తస్నిమ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘెర్‌ ఘలిబాఫ్‌ శుక్రవారం విమర్శించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించడం లేదని, ఇరాన్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇప్పటికీ విడుదల చేయలేదని తప్పుపట్టారు. 

శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఈ రెండు అంశాలు అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఇరాన్‌ నుంచి పది మందితో కూడిన ప్రతినిధి బృందం చర్చలకు రాబోతోందని పాకిస్తాన్‌లోని ఇరాన్‌ రాయబారి రెజా అమీర్‌ మొఘదామ్‌ గురువారం నిర్ధారించారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, ఇరాన్‌ ప్రతినిధి బృందం రాకను ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, వారి కోసం పాక్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది.  

దాడులు జరుగుతుండగానే చర్చలా?  
లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టంచేశారు. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని అంటూ తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో చర్చలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇరుపక్షాలను స్వాగతించడానికి పాక్‌ సర్కార్‌ సిద్ధమయ్యింది. చర్చల కోసం వచ్చే ప్రతినిధులకు, విలేకరులకు ‘వీసా ఆన్‌ అరైవల్‌’కింద వీసాలు ఇవ్వనున్నట్లు పాక్‌ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్‌ దార్‌ శుక్రవారం తెలిపారు.  

పాక్‌ మంత్రికి మునీర్‌ మందలింపు  
మానవాళికి శాపం ఇజ్రాయెల్, అదొక దయ్యం, క్యాన్సర్‌ అంటూ దూషించిన పాక్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ను ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తీవ్రంగా మందలించారు. ఆయనపై పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలిసింది. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటని మండిపడినట్లు సమాచారం. ఇజ్రాయె ల్‌ను దూషిస్తూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును ఖవాజా అసిఫ్‌ తర్వాత తొలగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement