చైనాకు చెక్‌.. AUKUS కూటమి భారీ వ్యూహం! | US, UK And Australia Launch AUKUS Underwater Drone Project For Indo-Pacific Security, More Details Inside | Sakshi
Sakshi News home page

చైనాకు చెక్‌.. AUKUS కూటమి భారీ వ్యూహం!

May 31 2026 10:52 AM | Updated on May 31 2026 1:30 PM

US UK and Australia to develop underwater drone

ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.

సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్‌ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్‌వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.

2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్‌సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్‌సీ వార్‌ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్‌సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్‌వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్‌ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement