
తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్ మహోన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.
మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్ లీవ్‌లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్‌తో పాటు మసాచుసెట్స్ పబ్లిక స్కూల్ సిస్టమ్స్ & యూనియన్స్ పిటిషన్లు వేశాయి.
అయితే మే 22వ తేదీన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్ జోన్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ యూఎస్ సర్క్యూట్ కోర్టు(బోస్టన్)ను ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..
సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.
లిండా.. ఫస్ట్ అండ్ లాస్ట్
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్‌పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్‌నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఎందుకీ నిర్ణయమంటే..
అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడుతున్నారు.