ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్‌ బ్లాక్‌బస్టర్‌ వ్యూహం | Donald Trump Administration Tightens Economic Pressure On Iran With New Sanctions On Shadow Banking Network, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు ముచ్చెమటలు.. ట్రంప్‌ బ్లాక్‌బస్టర్‌ వ్యూహం

Apr 29 2026 9:36 AM | Updated on Apr 29 2026 10:09 AM

US sanctions On Iran 35 shadow banking architecture Include China

అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్‌ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై..  ‘షాడో బ్యాంకింగ్’ నెట్‌వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్‌లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్‌పై ట్రంప్‌ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్‌పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్‌కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్‌ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్‌వర్క్‌కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. 
ఇదిలా ఉండగా.. ఇరాన్‌ టార్గెట్‌ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

బ్యాంకులకు ఝలక్‌.. 
మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్​ సెపాత్​ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్​ సినా సుప్రీం లీడర్​ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్​ బ్యాంక్‌లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్​ ఆయిల్​ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన షుకున్​ లిమిటెడ్​ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

చైనా రిఫైనరీలకు హెచ్చరిక..
ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్‌లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement