రెండు ఫైటర్‌ జెట్ల కూల్చివేత | US F-35, F-15e fighter jets destroyed over central Iran | Sakshi
Sakshi News home page

రెండు ఫైటర్‌ జెట్ల కూల్చివేత

Apr 4 2026 4:41 AM | Updated on Apr 4 2026 6:11 AM

US F-35, F-15e fighter jets destroyed over central Iran

ఎఫ్‌–35, ఎఫ్‌–15లను నేలకూల్చిన ఇరాన్‌ 

ఇరాక్‌లో అమెరికా హెలికాప్టర్‌ను కూడా? 

సురక్షితంగా బయటపడ్డ పైలట్, గన్నర్‌! 

ఒకరిని కాపాడిన అమెరికా దళాలు 

మరొకరి కోసం కొనసాగుతున్న వేట 

పట్టిస్తే రివార్డు ప్రకటించిన ఇరాన్‌

దుబాయ్‌: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఒక్క రోజే రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయింది. ఇరాక్‌లో ఒక బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను కూడా కోల్పోయినట్టు సమాచారం! అత్యాధునిక ఎఫ్‌–35, ఎఫ్‌–15ఇ యుద్ధ విమానాలను తమ గగనతలంపై కూల్చేసినట్టు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఎఫ్‌–35 పైలట్‌ ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టేనని పేర్కొంది. 

ఎఫ్‌–15ఇ పైలట్‌తో పాటు గన్నర్‌ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. వారు ఇరాన్‌ భూభాగంపై సురక్షితంగా దిగినట్టు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దాంతో వారిని కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కమాండో దళాలు, బంధించేందుకు ఇరాన్‌ సైన్యాలు ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగాయి. వారిలో ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా కాపాడి ఇరాన్‌ బయటికి తరలించినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన చానల్‌ 12 పేర్కొంది. రెండో వ్యక్తి విషయమై గందరగోళం నెలకొంది. 

అతను ఇప్పటికే ఐఆర్‌జీసీకి చిక్కినట్టు ఇరాన్‌కు చెందిన టాస్నిమ్‌ వార్తా సంస్థ పేర్కొంది. అదేమీ లేదని, అతన్ని కూడా కాపాడేందుకు అమెరికా ప్రత్యేక దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ కూడా సదరు ‘అమెరికా సైనికుడు’కనిపించిన వెంటనే కాల్చేయాల్సిందిగా స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది. కాసేపటికే, ‘‘అతన్ని ప్రాణాలతో పోలీసులకు పట్టించండి. అందుకు భారీ బహుమానం కూడా ఉంటుంది’’అంటూ ప్రకటించింది! 

రెస్క్యూ ఆపరేషన్‌లో బాగంగా ఘటనా స్థలిపై అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అమెరికా యుద్ధ విమానం తాలూకు శకలాలను ఇరాన్‌ సైన్యం ట్రక్కుల్లో తరలిస్తున్న దృశ్యాలు ఇరాన్‌ వార్తా చానళ్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. మరోవైపు అమెరికాకు చెందిన యూహెచ్‌–60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను కూడా ఇరాక్‌లో నేలకూల్చినట్టు ఇరాన్‌ పేర్కొంది. ఇరాక్‌ వర్గాలను ఉటంకిస్తూ టాస్నిం వార్తా సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం కూల్చివేత గురించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నివేదించినట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలినా లెవిట్‌ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థకు తెలిపారు. ఎఫ్‌–35, బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను కూడా కోల్పోయామన్న వార్తలపై మాత్రం అమెరికా అధికారికంగా స్పందించలేదు. 

ఒక్కో విమానం రూ. 940 కోట్లు! 
ఎఫ్‌–35, ఎఫ్‌–15ఇ యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు సైనికంగానే గాక ఆర్థికంగా కూడా ఎదురు దెబ్బే. ఇవి ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కదాని ఖరీదు 10 కోట్ల డాలర్ల (రూ.940 కోట్ల) దాకా ఉంటుంది! ఎఫ్‌–35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఉదయమే సెంట్రల్‌ ఇరాన్‌లో కూల్చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్‌ సిస్టం దన్నుతో అత్యంత కచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్‌హీత్‌ స్క్వాడ్రన్‌కు చెందినదని కూడా తెలిపింది. ‘‘మా దాడిలో విమానం పూర్తిగా దెబ్బ తిని కుప్పకూలింది. 

పైలట్‌ సురక్షితంగా బయట పడే అవకాశం లేనట్టే’’అని చెప్పుకొచ్చింది. మార్చి 19న కూడా ఒక అమెరికా ఎఫ్‌–35 యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చేయడం తెలిసిందే. దాంతో ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే రెండు ఎఫ్‌–35లను నష్టపోయింది. ఇక ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం దక్షిణ ఇరాన్‌లోని పర్వతమయ కోహ్‌కిలోయే, బోయర్‌–అహ్మద్‌ ప్రాంతంలో నేలకూలినట్టు సమాచారం. ఇది రాజదాని టెహ్రాన్‌కు 500 కి.మీ. దూరంలో ఉంటుంది. పొరుగునున్న చహర్‌మహల్, భక్తియారీ ప్రావిన్స్‌లో కూడా శత్రు పైలట్‌ కోసం వెదకాల్సిందిగా ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. 

యుద్ధంలోకి ఇరానీ బాలలు 
బాలలను కూడా ఇరాన్‌ యుద్ధ రంగంలోకి పంపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘12 ఏళ్ల పసివాళ్లకు కూడా రివల్యూషనరీ గార్డ్, 
బసిజ్‌ ఫోర్స్‌ తదితర విభాగాల్లో చేర్చుకుంది. వారి చేతికి ఆయుధాన్నిచ్చి కీలక ప్రాంతాల్లో పహారా విధుల్లో నియమించింది’’ అని పేర్కొంది.

మొసాద్‌ భవనం ధ్వంసం
ఇజ్రాయెల్‌ నిఘా విభాగమైన మొసాద్‌ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం నాటి దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఇరాన్‌ పేర్కొంది. టెల్‌ అవీవ్‌లో మంటల్లో కాలిపోతున్న భవనం తాలూకు ఫుటేజీని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ విడుదల చేసింది. దానిపై ఇరాన్‌ సైన్యం అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడి జరిపినట్టు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌ మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు.

జోర్డాన్‌లోనూ అమెరికా యుద్ధ విమానాలపై దాడి
జోర్డాన్‌లోని అల్‌ అజ్రాక్‌ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలపై భారీగా దాడులు జరిపినట్టు ఇరాన్‌ ప్రకటించింది. గురువారం రాత్రి వాటిపై డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు పేర్కొంది. ఈ దాడిలో విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందీ వెల్లడించలేదు. అమెరికా నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 

యూఎస్‌ రాడార్‌ ధ్వంసం! 
ఇరాన్‌ దాడుల్లో అత్యంత ఖరీదైన ఏఎన్‌/టీపీవై–2 రాడార్‌ను అమెరికా నష్టపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంపై ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఇ–3 విమానం, మరో రీ ఫ్యూయలింగ్‌ విమానంతో పాటు ఈ రాడార్‌ కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ రాడార్‌ అభివృద్ధికి అమెరికా 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,200 కోట్లు) వెచ్చించింది. 

భారతీయులకు గాయాలు 
అబుదాబిలోని అజ్బాన్‌ ప్రాంతంలో సహజవాయు క్షేత్రంపై ఇరాన్‌ భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు దిగింది. వాటి శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాలీలు స్వల్పంగా గాయపడ్డారు. మరో నేపాలీ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అబుదాబి మీడియా ఎక్స్‌ పోస్టులో వెల్లడించింది. 

రంగంలోకి జెరాల్డ్‌ ఫోర్డ్‌ 
అమెరికా విమానవాహక యుద్ధ నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ మళ్లీ యుద్ధ విధుల్లో చేరినట్టు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. మార్చిలో జరిగిన అగ్నిప్రమాదంలో నౌక పాక్షికంగా దెబ్బ తినడం తెలిసిందే. దాంతో మరమ్మతుల నిమిత్తం దాన్ని గ్రీస్‌కు తరలించారు.  

హార్మూజ్‌ దాటిన ఫ్రెంచి నౌక 
ఫ్రాన్స్‌కు చెందిన ఒక కంటైనర్‌ నౌక శుక్రవారం హార్మూజ్‌ జలసంధిని దాటింది! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధిని దాటిన తొలి యూరప్‌ నౌకగా ఇది నిలిచింది.  

ఇరాన్‌లో బ్రిడ్జి పేల్చివేత 
ఉత్తర ఇరాన్‌లో అల్బోర్జ్‌ ప్రావిన్స్‌లోని కరాజ్‌లో నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్‌ రెండు దఫాలుగా దాడులు జరిపాయి. దాంతో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బ తింది. ఎనిమిది మంది మరణించారు. ఇందుకు ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాల్లోని కీలక బ్రిడ్జిలను నేలమట్టం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇప్పటికే 8 బ్రిడ్జిలను హిట్‌లిస్ట్‌లో చేర్చినట్టు ప్రకటించింది. 

వీటిలో షేక్‌ జబార్‌ అల్‌ అహ్మద్‌ సీ బ్రిడ్జి (కువైట్‌), కింగ్‌ ఫాద్‌ కాజ్‌వే (సౌదీ–బహ్రెయిన్‌ లింక్‌), షేక్‌ జాయేద్‌ బ్రిడ్జ్, షేక్‌ ఖలీఫా, బ్రిడ్జి (యూఏఈ); కింగ్‌ హుసేన్‌ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్‌ బ్రిడ్జ్‌ (జోర్డాన్‌) ఉన్నాయి. బ్రిడ్జిపై దాడి తాలూకు వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో షేర్‌ చేశారు. ‘‘సమయం మించిపోకముందే తమతో ఒప్పందానికి రండి. లేదంటే ఇలాంటి భారీ దాడులను మరింతగా చవిచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఇరాన్‌ను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement