
వాషింగ్టన్: తన ఇష్టానుసారం అడ్డగోలుగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాల చాలా వరకు చట్ట విరుద్దమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో, ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. పలు దేశాలను టార్గెట్ చేసిన ట్రంప్ ఇష్టానుసారం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలపై అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. ఈ క్రమంలో 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు.
ఇదే సమయంలో ట్రంప్ సర్కార్ భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో , ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
మరోవైపు.. కోర్టుపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుంది. అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమలులో ఉంది. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి. అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుంది. కానీ, ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం.

మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్‌లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఒక వేళ టారిఫ్‌లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులకు సహాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్‌లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.