రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోతుంటే..మీకు అది వరమైందంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా భారత్‌పై విరుచుకుపడ్డారు. మా కారణంగానే మీకు రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది నైతికంగా భారత్‌కి తగనిది అని నొక్కి చెప్పారు. మా బాధల కారణంగా మీరు ప్రయోజనం పొందినట్లయితే మాకు మరింత సాయం చేయడం మంచిది అని కులేబా చురకలంటించారు.
మరోవైపు ఇటీవలే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఏడాదిలో కేవలం ఫిబ్రవరి, నవంబర్ నెలల మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా నుంచి అత్యధిక స్థాయిలో శిలాజ ఇధనాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా ఈయూ కూడా అదే పనిచేస్తోందని ఆవేదన చెందారు. భారత్ చౌకైన చమురు లభించడం వెనకాల బాధలనుభవిస్తున్న ఉక్రెయిన్లను చూడండి అని భారత్‌ని అభ్యర్థించారు.
భారత్ రష్యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తూనే..యుద్ధం విషయంలో రష్యా తీరుని ఖండించింది కానీ ఐక్యరాజ్యసమితిలో మాస్కోకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉందన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇది యుద్ధం చేసేందుకు సమయం కాదు అని ఉక్రెయిన్‌కి మద్దతుగా ప్రోత్సాహకరమైన సందేశాలు ఇచ్చారు. అలాగే మోదీ తన స్వరంతో దేన్నైనా మార్చగలరన్నారు. అందువల్ల యుద్ధం ముగించడంలో ఢిల్లీ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని, ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు.
ప్రస్తుతం సమష్టి కృషి చేయడం ముఖ్యం, అందువల్ల భారత్ ముందుగా ప్రయత్నించకపోతే ఏది కాదని డిమెట్రో కులేబా వ్యాఖ్యానించారు. అలాగే ఈ శీతకాలంలో సైతం కీవ్ తన సైనిక దాడిని ఆపదని చెప్పారు. తాము ఒక్క రోజు కూడా ఆగమని, ఎందుకంటే తాము తీసుకునే ప్రతి విరామంలో రష్యా ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో వారి రక్షణ రేఖలను బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తుందన్నారు. అదీగాక గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు దిగిందని చెప్పారు.
(చదవండి: బహిరంగంగా విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన)
Comments
Please login to add a commentAdd a comment