ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్‌ ప్రధాని షాక్‌ | Uk Pm Keir Starmer Says This Is Not Our War | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్‌ ప్రధాని షాక్‌

Apr 1 2026 4:33 PM | Updated on Apr 1 2026 4:54 PM

Uk Pm Keir Starmer Says This Is Not Our War

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ షాక్‌ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్‌ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్‌.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్‌ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్‌ అన్నారు.

‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఇరాన్‌పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్‌ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి.

..మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్‌ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్‌ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement