
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.
పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్‌పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.
The polls are open.
Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024
మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్‌పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.
పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.
మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి.
ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు.