
ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ప్రకటన
అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలు బేఖాతరు
లండన్: పరమకిరాతకంగా వందల కొద్దీ బాంబులేస్తూ, భూతల దాడులుచేస్తూ పాలస్తీనియన్ల మరణశాసన రాస్తున్న ఇజ్రాయెల్‌పై ధర్మాగ్రహంతో బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గాజావాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ మూడు దేశాలు ఆదివారం ప్రకటించాయి.
పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయనిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం వ్యాఖ్యానించారు. తామూ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్‌చేశారు. తాము సైతం పాలస్తీనాకే మద్దతు పలుకుతున్నట్లు ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించింది.
కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణమృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్‌లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరిచింది. కాల్పుల విరమణ, గాజాలో ఐరాస మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలితే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ ప్రకటించారు.
ద్విదేశ పరిష్కారం ఉత్తమం
ఈ మేరకు లండన్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి స్టార్మర్ పేరిట ఒక వీడియో సందేశం వెలువడింది. ‘‘ పాలస్తీనియన్లకు అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఇది హమాస్ సాయుధ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తులో పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదు. పాలస్తీనాలో శాంతియుత భవిత కోసం మనందరం కలసినడుద్దాం. హమాస్ చెరలోని బందీలను విడిపించుకుందాం. ఘర్షణలకు చరమగీతం పాడదాం.
శాంతి, భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమం’’ అని స్టార్మర్ స్పష్టంచేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతరకాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాది రాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తానాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే భారత్ సహా 140కిపైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానంచేసి ఐరాసతో స్వతంత్రదేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యాయి. అయితే ఈసారి ఆ దిశగా అడుగులుపడే అవకాశముందని తెలుస్తోంది.
తప్పుబట్టిన నెతన్యాహూ
ఆ్రస్టేలియా, యూకే, కెనడాల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుబట్టారు. ‘‘మీరంతా పాలస్తీనాను దేశంగా గుర్తించినంతమాత్రాన సరిపోదు. దానిని వాస్తవరూపంలోకి తీసుకురావాలి. అది అసాధ్యం. పాలస్తీనాను గుర్తించడం అంటే 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ సాయుధుల మెరుపుదాడి, వందల మంది ఊచకోతను ఈ దేశాలన్నీ సమరి్థంచినట్లే. ఈ తాజా గుర్తింపు హమాస్‌కు మీరంతా ఇచ్చే బహుమతితో సమానం.
జోర్డాన్ నదీ పశ్చిమాన పాలస్తీనా ఆవిర్భావాన్ని నేను సాధ్యంకానివ్వను. వచ్చే వారం అమెరికాలో పర్యటన, ట్రంప్‌తో భేటీ తర్వాత నా తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా’’ అని నెతన్యాహూ అన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక ఓట్టొమన్ రాజ్యపతనం ఆరంభమైంది. అప్పటి నుంచి వందేళ్లపాటు పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాలపై ఫ్రాన్స్, బ్రిటన్‌ల ఆధిపత్యం కొనసాగింది.
యూదుల కోసం ఒక దేశం అవసరమని చేసిన 1917లో చేసిన బాల్ఫోర్ తీర్మానాన్ని బ్రిటనే రచించింది. తీర్మానం మొదటిభాగాన్ని సవ్యంగా అమలుచేసిన బ్రిటన్ ఆ తర్వాత రెండో భాగాన్ని గాలికొదిలేసింది. పాలస్తీనియన్ల పౌర, మత హక్కులకు ఎలాంటి అవరోధాలు సృష్టించకూడదని రెండోభాగంలో తీర్మానించినా అది ఇజ్రాయెల్ కారణంగా అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత బ్రిటన్ పాలస్తీనాను గుర్తించి గతంలో తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసిందని రాయల్ యునైటెడ్ సరీ్వసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకుడు బెర్కూ ఒజ్‌సేలిక్ వ్యాఖ్యానించారు.