
విజయవంతంగా ధ్వంసం చేసిన భారత్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు.
గతంలో అర్మేనియా–అజర్‌బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్‌ను ఆత్మాహుతి డ్రోన్‌గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత.
విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు
మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్‌లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్‌లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి.
తుర్కియే నుంచే తెప్పించారు
తుర్కియే దేశంలోని అసిస్‌గార్డ్ సోన్‌గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్‌ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఎందుకీ పేరు?
కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు.