
జమ్మూ ఎయిర్‌పోర్ట్ టార్గెట్‌గా పాక్ డ్రోన్లతో దాడి చేసింది. ఎఫ్-16ను పాక్ ఆర్మీ ప్రయోగించింది. భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 10 పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సైరన్లతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు బంద్ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ నగరమంతా విద్యుత్‌ను నిలిపివేశారు. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలు కూడా నిలిపివేశారు. సాంబ సెక్టార్‌లో పాక్ కాల్పులకు తెగబడింది. ఎస్-400 సిస్టమ్‌తో పాక్ మిస్సైళ్లను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17లను కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ.. పాక్‌ను మరో చావు దెబ్బ కొట్టింది. మూడు ఫైటర్ జెట్లను భారత్ సైన్యం కూల్చివేసింది.
జమ్మూ, సివిల్ ఎయిర్‌పోర్ట్, సాంబ, ఆర్‌ఎస్‌పుర, చానీ మహిత్, అర్నియా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఎఫ్-16 దాడికి ప్రయత్నించింది. పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్ ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.
కాగా, పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఇవాళ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.