తులసి గబ్బార్డ్‌ ఎగ్జిట్‌.. వైట్‌హౌస్‌లో ఏం జరిగింది? | Is Tulsi Gabbard Out Of Trumps White House Camp | Sakshi
Sakshi News home page

తులసి గబ్బార్డ్‌ ఎగ్జిట్‌.. వైట్‌హౌస్‌లో ఏం జరిగింది?

May 23 2026 1:46 PM | Updated on May 23 2026 2:14 PM

Is Tulsi Gabbard Out Of Trumps White House Camp

అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్‌.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్‌హౌస్‌ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్‌తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. 

అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్‌ (DNI) పదవికి తులసి గబ్బార్డ్‌  రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్‌ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. 

భారతీయ మూలాలు లేకున్నా.. 
తులసి గబ్బార్డ్‌(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్‌ గబ్బర్డ్‌ సమోవన్‌-యూరోపియన్‌ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్‌ గబ్బార్డ్‌ అమెరికన్‌. కానీ ఆమె తల్లి క్యారెల్‌ గబ్బార్డ్‌కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్‌ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్‌పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్‌ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్‌ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. 

ఏం జరిగి ఉండొచ్చు?
అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్‌ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్‌ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.

ప్రత్యేకించి.. ఇరాన్‌ విషయంలో తులసి గబ్బార్డ్‌ వైఖరి మొదటి నుంచి ట్రంప్‌ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్‌ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ట్రంప్‌.. పొగిడారు కదా!
ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్‌హౌస్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్‌ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్‌మీడియాలో తుల్సీ గబ్బార్డ్‌ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్‌ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. 

ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్‌ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్‌.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

తులసి గబ్బార్డ్‌ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్‌ అబ్రహాం విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement