అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అబ్రహం అకార్డ్స్ విస్తరణపై మాట్లాడిన ట్రంప్.. తన సోషల్ మీడియా సందేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించలేదు. బదులుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను పేర్కొనడం ఇస్లామాబాద్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
అబ్రహం అకార్డ్స్ విస్తరణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో పాకిస్తాన్ పేరు కూడా చర్చలోకి రావడం ఇస్లామాబాద్‌కు అత్యంత సున్నితమైన పరిణామంగా మారింది. ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశం దేశంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారింది.
ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతను తెచ్చాయి. ఆయన తన పోస్టులో సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నాయకులను ప్రస్తావించినప్పటికీ.. పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టి అసిమ్ మునీర్‌ను మాత్రమే పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నిర్మాణంలో సైనిక వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యంపై అంతర్జాతీయ దృష్టిని మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది.
మిగిలిన దేశాల నాయకులను వారి రాజ్యాంగ పదవుల ద్వారా గుర్తించగా, పాకిస్తాన్‌ను మాత్రం దాని సైనిక అధిపతి ద్వారా గుర్తించారు. అక్కడ షరీఫ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతర్జాతీయ సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ట్రంప్ చేసిన ఎంపిక పాకిస్తాన్‌లో అధికార కేంద్రం ఎక్కడ ఉందన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.
గత కొంతకాలంగా పాకిస్తాన్‌లో విదేశాంగ విధానాలు, భద్రతా నిర్ణయాల్లో సైన్యం ప్రభావం పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రస్తావన ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉందన్న పాత చర్చను ఇది మళ్లీ వేడెక్కించింది.
ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ అవగాహన లోపం కాదని.. దేశంలో సివిలియన్ ప్రభుత్వం కంటే సైనిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అబ్రహం అకార్డ్స్ అంశం పాకిస్తాన్‌కు మరో దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు దేశంలో ఉన్న తీవ్ర భావోద్వేగ రాజకీయ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఒత్తిడుల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


