వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమెరికా ట్రెజరీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇకపై ముద్రించనున్న అన్ని కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనున్నట్లు వెల్లడించింది. దీంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికినట్టైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ‘చారిత్రాత్మక సంస్కరణ’గా అభివర్ణించింది. ఇప్పటివరకు అమెరికా కరెన్సీపై ట్రెజరర్, ట్రెజరీ సెక్రటరీ సంతకాలు మాత్రమే ఉండేవి. అధ్యక్షుడి సంతకం నేరుగా నోట్లపై ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.
ట్రెజరీ శాఖ ప్రకటన ప్రకారం.. కొత్త డిజైన్‌తో విడుదలయ్యే నోట్లపై ట్రంప్ సంతకం 2026 చివరి త్రైమాసికం నుంచి కనిపించనుంది. ఈ మార్పు అమెరికా కరెన్సీకి ‘జాతీయ గుర్తింపు,నాయకత్వ ప్రతీక’గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయీకరణగా అభివర్ణిస్తూ, కరెన్సీ వ్యవస్థను అధ్యక్షుడి వ్యక్తిగత బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అమెరికా చరిత్రలో కరెన్సీ డిజైన్ మార్పులు చాలా అరుదుగా జరుగుతాయి. ముఖ్యంగా సంతకాల విషయంలో 1861 నుంచి కొనసాగుతున్న విధానాన్ని మార్చడం పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మార్పు అమెరికా కరెన్సీపై ప్రజల దృష్టిని మరింత ఆకర్షించవచ్చు. దీనికి రాజకీయ ప్రభావం కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
ట్రంప్ సంతకం ఉన్న నోట్లను ప్రజలు ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటారన్న దానిపై ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. కానీ కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టుగా భావిస్తున్నారు.


