వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.
మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్‌లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.
తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.


