
టెక్సాస్‌లోని డల్లాస్‌లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.
టెక్సాస్‌లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
నిందితుడు కోబో మార్టినెజ్‌పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.
ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.
కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు.
ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార.
ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.