ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌ సంచలన ప్రకటన | Trump Huge Claim Over Enriched Uranium, Iran Respond With This | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌ సంచలన ప్రకటన

Apr 17 2026 6:50 AM | Updated on Apr 17 2026 10:38 AM

Trump Huge Claim Over Enriched Uranium, Iran Respond With This

పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో  శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరించిందని చెప్పారు. 

గురువారం వైట్‌హౌజ్‌ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్‌ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. 

ఈ డీల్‌ కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్‌ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే.. ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదన్న ఇంతకు ముందు ప్రకటించిన ట్రంప్‌ కాస్త చల్లబడ్డారు. పొడిగింపునకు తాను సిద్ధమేనని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల యుద్ధ విరమణ గడువు ఈ నెల 22న ముగియనుంది.

మరోవైపు.. ఇరాన్‌ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఉద్ఘాటించారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా వాళ్లు ముందు మరో దారిలేదన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. 

ఇరాన్ తన అణు శుద్ధి ప్రయత్నాలను విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని మొదటి నుంచి చెబుతున్నా.. అణ్వాయుధాల తయారీకి వీలుగా యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్‌ సహా అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను బయటకు తీయాలని.. అణు ఒప్పందానికి ముందుకు రావాలని అమెరికా ఇరాన్‌ను డిమాండ్‌ చేస్తోంది. 

“ఇకపై యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ఉండదు” అన్నది ట్రంప్‌ తాజా మాట. దీనిపై ఇరాన్‌ ఇంకా స్పందించలేదు. 2025 జూన్‌లో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అంచనా ప్రకారం.. ఇరాన్ వద్ద దాదాపు 400 కిలోల 60% శుద్ధి యురేనియం, అలాగే 200 కిలోల 20% యురేనియం నిల్వ ఉంది. ఈ నిల్వలను సులభంగా 90% ఆయుధ స్థాయి యురేనియంగా మార్చుకోవచ్చు!.

పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్‌లో ఈ నెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు..  యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశ్యం లేదని ఇరాన్‌ స్పష్టంగా పేర్కొంది. ట్రంప్‌ తాజా ప్రకటనతో అమెరికా–ఇరాన్ ‘అణు’ వివాదం కొత్త మలుపు తిరిగే చాన్స్‌ ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement