ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్‌ సంచలన నిర్ణయం | Trump Has 3 Military Options Against Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

Apr 30 2026 4:43 PM | Updated on Apr 30 2026 5:11 PM

Trump Has 3 Military Options Against Iran

వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

 ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్‌) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్‌ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.

చర్చలలో ప్రధాన అంశాలు
ట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్‌ ఆపరేషన్‌ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్‌ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్‌ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.

మూడవ ప్రత్యామ్నాయం
ఈ బ్రీఫింగ్‌లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్‌ నివేదిక హైలెట్‌ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement