ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా డొనాల్డ్‌ ట్రంప్‌?! | Trump Claims Iran Proposed Making Him Supreme Leader Amid Middle East Conflict, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా డొనాల్డ్‌ ట్రంప్‌?!

Mar 26 2026 11:51 AM | Updated on Mar 26 2026 1:05 PM

Trump claims Iran proposed making him Supreme Leader

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్‌కి సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించిందని, కానీ తాను తిరస్కరించానని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.

వాషింగ్టన్‌లో జరిగిన రిపబ్లికన్ ఫండ్‌రైజర్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నాయకత్వం నన్ను సుప్రీం లీడర్‌గా చూడాలని అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆ పదవి ఎవరూ కోరుకోరు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా చర్యలను ‘మిలిటరీ డెసిమేషన్’గా వర్ణించారు. అంటే సింహ భాగం ఇరాన్‌ సైన్యాన్ని నాశనం చేశాం. తద్వారా మేం ము సాధించిన విజయాన్ని ఎవరూ చూడలేదు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ తమ ప్రజల భయంతో, అలాగే అమెరికా ప్రతీకార దాడుల భయంతో బహిరంగంగా చెప్పలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు.  

ఖండించిన ఇరాన్‌ 
ట్రంప్‌ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఒకవైపు ఆయన ‘ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది’ అని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ‘ఎలాంటి చర్చలు లేవు’ అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.

అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. శకలాలు మోజ్తబా కాలును ఛిద్రం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాలును తొలగించి చికిత్స కొనసాగిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభాన్ని మరింతగా పెంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement