భారత్‌–పాక్‌ ఘర్షణలో  5 ఫైటర్‌ జెట్లు నేలమట్టం | "5 Jets were Shot down": Trump Makes Another Claim On Op Sindoor | Sakshi
Sakshi News home page

భారత్‌–పాక్‌ ఘర్షణలో  5 ఫైటర్‌ జెట్లు నేలమట్టం

Jul 19 2025 12:11 PM | Updated on Jul 20 2025 6:16 AM

"5 Jets were Shot down": Trump Makes Another Claim On Op Sindoor

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టీకరణ  

అవి ఏ దేశానివో చెప్పని వైనం  

రెండు దేశాల యుద్ధాన్ని తానే ఆపేశానని పునరుద్ఘాటన

న్యూయార్క్‌:  ఆపరేషన్‌ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు నేలమట్టమయ్యాయని చెప్పారు. అవి గాల్లోనే పేలిపోయి నేలకూలాయని, అది నిజంగా దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. అయితే, కూలిపోయిన యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి? అనే సంగతి ట్రంప్‌ బయటపెట్టలేదు. 

అవి భారత్‌కు చెందినవా? లేక పాకిస్తాన్‌కు చెందినవా? లేక ఇరు దేశాలకు చెందినవా? అనేది ప్రకటించకపోవడం గమనార్హం. వైట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి రిపబ్లికన్‌ సెనేటర్లు ఇచ్చిన విందు కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడారు. తాను చొరవ తీసుకోవడం వల్లే భారత్‌–పాక్‌ మధ్య యుద్ధంగా ఆగిపోయిందని పునరుద్ఘాటించారు. 

శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు పరస్పరం ఘర్షణకు దిగాయని, దాడులు చేసుకున్నాయని.. తాను రంగంలోకి దిగి ఆపకపోతే అది తీవ్రమైన యుద్ధంగా మారేదని అన్నారు. తన హెచ్చరికలతో రెండు దేశాలు దిగొచ్చాయని, ఘర్షణకు ముగింపు పలికాయని స్పష్టంచేశారు. 

భారత్, పాక్‌లపై ‘వాణిజ్య’హెచ్చరికల అస్త్రం ప్రయోగించానని, దాంతో అవి తన మాట విన్నాయని తెలిపారు. గత ఆరు నెలల పాలనలో ఎంతో సాధించామని, ఎన్నో యుద్ధాలు ఆపేశామని, అందుకు గర్వపడుతున్నానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.  

ట్రంప్‌ ప్రమేయం లేదు
  ఆపరేషన్‌ సిందూర్‌లో తమకు కొంత నష్టం వాటిల్లిందని, యుద్ధ విమానాలు కోల్పోయామని భారత్‌ సైన్యం ఇప్పటికే అంగీకరించింది. అయితే, పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరు ఫైటర్‌ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్‌ ప్రకటించింది. కానీ, అందుకు ఆధారాలేవీ చూపించలేదు. పాక్‌ ప్రకటనను భారత సైన్యం ఖండించింది. మే 31వ తేదీన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సింగపూర్‌లో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై, శిక్షణా శిబిరాలపై దాడులు చేశామని వెల్లడించారు.

 ముష్కరులను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టామని, ఈ క్రమంలో తమకు కొంత నష్టం జరిగిన మాట నిజమేనని తెలిపారు. ఇండియాకు చెందిన ఆరు ఫైటర్‌ జెట్లను కూల్చేశామంటూ పాక్‌ చేసిన ప్రకటనలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. భారత్‌–పాక్‌ ఘర్షణను ఆపేశానంటూ ట్రంప్‌ గతంలోనూ తనకు తానే కితాబిచ్చుకోగా, భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. పాక్‌ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడంతో స్పందించి దాడులు నిలిపేశామని, ఇందులో ట్రంప్‌ ప్రమేయం ఏమీ లేదని తేల్చిచెప్పింది. భారత సైన్యం మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు ఈ ఆపరేషన్‌ కొనసాగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement