మొన్నటిదాకా జార్జియా మెలోనీ.. డొనాల్డ్ ట్రంప్‌కు యూరప్‌లో అత్యంత సన్నిహిత మిత్రురాలిగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు అత్యంత నమ్మకమైన యూరోపియన్ భాగస్వామిగా నిలిచారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకోవడం, బహిరంగ వేదికలపై పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకోవడం కనిపించింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలవడం, అది వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ట్రంప్–మెలోనీ స్నేహానికి ఎక్కడ బీటలు వారాయో గమనిస్తే..
ట్రంప్–మెలోనీ బంధం కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు. కుడిపక్ష(రైట్‌వింగ్) భావజాలం, వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అందుకే యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా మెలోనీకి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ స్నేహంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క ఫొటో వివాదం కాదు. గత కొన్ని నెలలుగా పేరుకుపోతున్న రాజకీయ విభేదాల ఫలితంగా కనిపిస్తోంది. ఆ ఐదు కారణాలివే..
1. మొదటి చిచ్చు.. యుద్ధమే!
ట్రంప్‌కు మెలోనీ ఎంత సన్నిహితురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనిపిస్తుంది. 2025లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. ఆ తర్వాత గాజా శాంతి చర్చల సందర్భంగా మెలోనీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ కొనియాడారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్‌పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్‌లో అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీసింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్లాయో చెప్పకనే చెబుతోంది.
2. పోప్ లియో వివాదం
ఇరాన్ యుద్ధంపై పోప్ లియో XIV శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్ పిలుపునివ్వగా.. ట్రంప్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్ మాట్లాడటం తగదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే కాథలిక్ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం పోప్‌కు బహిరంగంగా అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
ఈ పరిణామం ట్రంప్‌కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది. దీంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒక దశలో పోప్ కంటే మెలోనీనే పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ ట్రంప్ సెటైర్లు వేయగా.. మెలోనీ కూడా వెనక్కి తగ్గకుండా తన వైఖరిని సమర్థించుకున్నారు. దీంతో విధానపరమైన విభేదం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
3. G7లో బహిరంగ విభేదాలు
ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సులోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదటిసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా సవాలు చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–యూరప్ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు బయటకు కనిపించినా.. ఆ సమావేశాల్లో వాతావరణం అంత స్నేహపూర్వకంగా లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ తరచూ చేస్తున్న ‘యూరప్ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం తెరవెనుక మాత్రమే ఉన్న విభేదాలు G7 వేదికగా అందరికీ కనిపించే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇదే ఇద్దరి బంధంలో కీలక మలుపుగా నిలిచింది.
4. ఫొటో వ్యాఖ్యలతో మరింత దూరం
ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో వివాదం. G7 సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు "బతిమాలిందని", "ఆమెపై జాలిపడి ఫొటో ఇచ్చానని" ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని మెలోనీ ఈసారి మాత్రం వెంటనే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవ్వరినీ బతిమాలుకోదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అంతటితో ఆగకుండా, పశ్చిమ దేశాల మిత్రుల పట్ల ట్రంప్ చూపుతున్న వైఖరిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మిత్రదేశాల కంటే ప్రత్యర్థి దేశాల నేతల పట్ల ఆయన మరింత మర్యాదగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ట్రంప్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు మెలోనీ తన అభిమానుల్లో ఒకరని, కానీ ఇప్పుడు ఆమె తనకు అభిమానిగా ఉండటం ఇష్టం లేదంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విభేదాలుగా మొదలైన ఈ ఘర్షణ.. వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగానే పంచులు వేసుకోవడం పరిస్థితి ఎంత మారిపోయిందో చెబుతోంది.
5. మెలోనీ శిబిరం నుంచి ఎదురుదాడి
ఈ వివాదంలో అత్యంత గమనార్హమైన అంశం మెలోనీ చుట్టూ ఉన్న నాయకుల స్పందన. సాధారణంగా ట్రంప్‌పై నేరుగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే మెలోనీ శిబిరం ఈసారి మాత్రం అసాధారణంగా ఘాటుగా స్పందించింది. ప్రధాని కార్యాలయంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా భావించే జియోవాన్‌బట్టిస్టా ఫజ్జోలారి ఏకంగా ట్రంప్ అమెరికా–యూరప్ చారిత్రక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో యూరప్ అంతటా అమెరికా వ్యతిరేక భావన పెరిగేలా చేస్తున్నారని కూడా విమర్శించారు.
ఇంతటితో ఆగకుండా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనితో పాటు అమెరికాలో జరగాల్సిన ఇటలీ–అమెరికా వ్యాపార సదస్సు కూడా వాయిదా పడింది.
ఈ వివాదాన్ని కేవలం ట్రంప్–మెలోనీ మధ్య వ్యక్తిగత ఘర్షణగా చూడలేం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా–యూరప్ సంబంధాలు, నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువైపులా పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది తాజా ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రంప్‌కు యూరప్‌లో అత్యంత విశ్వసనీయ మిత్రురాలిగా భావించిన మెలోనీ సైతం ఇప్పుడు బహిరంగంగానే విభేదించడం పరిస్థితి ఎంత మారిపోయిందో సూచిస్తోంది. అందుకే ఈ మాటల యుద్ధం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా? లేక అమెరికా–యూరప్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరానికి, అట్లాంటిక్ మిత్రబంధంలో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.


