షినవత్రకు థాయ్‌లాండ్‌ రాజు క్షమాభిక్ష | Sakshi
Sakshi News home page

షినవత్రకు థాయ్‌లాండ్‌ రాజు క్షమాభిక్ష

Published Sat, Sep 2 2023 5:48 AM

Thaiand king reduces ex-PM Thaksin 8-year prison sentence to One Year - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాజీ ప్రధానమంత్రి థక్సిన్‌ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్‌కర్న్‌ నిర్ణయాన్ని రాయల్‌ గజెట్‌ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు.

2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్‌ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్‌లో మద్దతు పెరగడం విశేషం.

Advertisement
 
Advertisement