ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ కాలంలో వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.
ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.
కాగా రష్యాకు భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది.


