నగరం మధ్యలో గొర్రెల మంద | Sheep herds move through German cities for winter pastures | Sakshi
Sakshi News home page

నగరం మధ్యలో గొర్రెల మంద

Nov 17 2025 4:46 AM | Updated on Nov 17 2025 4:46 AM

Sheep herds move through German cities for winter pastures

బెర్లిన్‌: జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో ఆదివారం ఓ అరుదైన దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. ఒకటీ రెండూ కాదు..ఏకంగా 600కు పైగా గొర్రెలు నగరం మధ్యభాగం నుంచి శీతాకాలపు ప చ్చిక బయళ్ల వైపు నడక సాగించాయి. ఈ దృశ్యం చూసి అబ్బురపడిన పాదచారులు తమ సెల్‌ఫోన్లలో గుంపులుగా సాగిపోతున్న గొర్రెల మంద ఫొటోలను తీసుకున్నారు. 

థామస్‌ గాక్‌స్ట్టట్టర్‌ అనే వ్యక్తికి చెందిన గొర్రెలివి. ఏటా శీతాకాల సమీపిస్తున్న వేళ ఇలా నగరం నడి»ొడ్డు మీదుగా శీతాకాలపు మేతకు ఇలా వెళుతుంటాయి. ఈ గొర్రెలను వేసవి కాలంలో నగరంలోని వివిధ ప చ్చిక బయళ్లలో గడ్డిని చక్కగా, సమానంగా ఉంచటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవి నగరం మధ్యగుండా న్యూరెంబర్గ్‌ పశి్చమాన ఉన్న శీతాకాలపు మేత ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. 

10 కిలోమీటర్ల ప్రయాణం 
ఇవి దాదాపు పది కిలోమీటర్ల దూరం ఇలా నడక సాగిస్తాయి. ఈ ప్రయాణంలో భాగంగానే నగరం మధ్యనున్న ప్రధాన మార్కెట్‌ గుండా వెళ్తున్నాయని డీపీఏ వార్తా సంస్థ తెలిపింది. జర్మనీలోని ఇతర నగరాల మాదిరిగా కాకుండా నగరం మధ్య కూడలిని గొర్రెలు దాటే ఏకైక ప్రాంతం న్యూరెంబర్గ్‌ మాత్రమేనని పేర్కొంది. ఈ నగర జనాభా సుమారు 5.40 లక్షలు. గొర్రెలు నగరం గుండా సాగే వేళ అధికారులు ప్రజలకు అనేక సూచనలు చేశాయి. వాటికి దారి ఇవ్వాలని, కుక్కలను వాటికి దూరంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా, ముందు జాగ్రత్తగా డ్రోన్ల సంచారాన్ని నిషేధించారు. 

గొర్రెలే లాన్‌ మూవర్లు! 
జర్మనీలోని న్యూరెంబర్గ్, పోట్స్‌డామ్, ఆగ్స్‌బర్గ్, బెర్లిన్, ఉల్మ్‌ తదితర నగరాల్లో గొర్రెలను సహజ లాన్‌మూవర్లు (గడ్డిని కోసే యంత్రాలు)గా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే.. గొర్రెలు నెమ్మదిగా గడ్డి మేయడం వల్ల కీటకాలకు హాని జరగదు. గడ్డి సహజంగా పెరుగుతుంది. ఈ విధంగా జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటున్నారు. అంతేకాదు, గడ్డి కోసేందుకు అయ్యే ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ఖాళీ బహిరంగ స్థలాలు కొరతగా మారుతున్న ఈ రోజుల్లో గొర్రెల కాపర్లకు ఇదో చక్కని ఏర్పాటుగా చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement