Ukraine-Russia War: చర్చలకు వెన్నుపోటు

Russia Says Bucha Claims That Distract Attention From Ukraine Talks - Sakshi

లివీవ్‌: యుద్ధానికి చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్న ఆశలపై రష్యా నీళ్లుచల్లింది. చర్చల ప్రక్రియకు ఉక్రెయిన్‌ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడుస్తోందని బుధవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ముందుగా రష్యా దళాలు తమ దేశం నుంచి వెనుదిరగాలని ఆ తర్వాత శాంతి ఒప్పందం చేసుకుని, దానిపై ప్రజల్లో రిఫరెండం జరిపిద్దామని ఉక్రెయిన్‌ చేస్తున్న ప్రతిపాదనలు అర్థం లేనివని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వ్యాఖ్యలు చేశారు.

‘ఒప్పందానికి రిఫరెండంలో ఉక్రెయిన్‌ ప్రజలు ఆమోదం తెలపకపోతే ఏం చేస్తారు? ఈ పిల్లీ ఎలుకా ఆటలు మాకిష్టం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. 2015లో తూర్పు ఉక్రెయిన్‌ విషయమై ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తిత్వంలో కుదిరిన మిన్స్‌క్‌ ఒప్పందం అమలుకే నోచుకోలేదని గుర్తు చేశారు. కాగా, ఉక్రెయిన్‌కు సంఘీభావ సూచకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ ముద్దాడారు. 

తీవ్ర దాడులు 
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెర్నోపిల్‌ ప్రాంతంలో రష్యా క్షిపణులు రసాయనాలతో నిండిన ఆరు రిజర్వాయన్లను ధ్వంసం చేయడంతో అక్కడ భూగర్భ, నదీ జలాలు కలుషితమైనట్టు ఉక్రెయిన్‌ చెప్పింది. యుద్ధం వల్ల కనీసం 74 దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, 120 కోట్ల మంది ఆహార, ఇంధన, ఎరువుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ఆవేదన వెలిబుచ్చారు.   

పుతిన్‌ కూతుళ్లపై ఆంక్షలు 
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూతుళ్లు మరియా పుతినా, క్యాథరినా తికొనోవాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. త్వరలో మరిన్ని ఆంక్షలుంటాయంటూ అధ్యక్షుడు బైడెన్‌ ట్వీట్‌ చేశారు. పుతిన్‌ కూతుళ్ల వివరాలను రష్యా అత్యంత గోప్యంగా ఉంచుతూ వస్తోంది. వారు రష్యా వర్సిటీలోనే చదువులు పూర్తి చేశారని గతంలో పుతిన్‌ వెల్లడించారు. మరియా ఓ ప్రైవేట్‌ కంపెనీలో, క్యాథెరినా మాస్కో స్టేట్‌ వర్సిటీలో పని చేస్తున్నట్టు సమాచారం. 

ఉక్రెయిన్‌కు ‘చెక్‌’ యుద్ధ ట్యాంకులు 
ఉక్రెయిన్‌కు టీ–72 యుద్ధ ట్యాంకులు, బీవీపీ–1 సాయుధ వాహనాలు పంపుతూ చెక్‌ రిపబ్లిక్‌ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశంగా నిలిచింది. మిగతా దేశాలన్నీ ఇప్పటిదాకా యాంటీ ట్యాంక్‌ మిసైళ్లు, చిన్న ఆయుధాలు, పరికరాలు ఇస్తూ వచ్చాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top