
అరచేతి గీతల్లోనే అంతా ఉందంటారు.. గీత సరిగా లేకుంటే.. తలరాతే మారిపోతుందంటారు.. మనుషుల వరకూ ఓకే.. మరి ఇదే ‘గీత’ సిద్ధాంతం అంతరిక్ష నౌకలకు కూడా వర్తిస్తే.. గీత సరిగా లేక.. వాటి ‘బతుకు’ రాతే మారిపోతే.. సరిగ్గా 63 ఏళ్ల క్రితం జరిగింది ఇదే!!
శుక్ర మహా‘దిశ’ సరిగాలేక...
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. భూమికి ఆవల ఉన్న గ్రహాలపై తన తొలి ప్రయోగాలు కొనసాగిస్తున్న సమయం అది.. వీనస్(శుక్రుడు)పై అధ్యయనానికి మెరైనర్–1ను సిద్ధం చేసింది. శుక్ర గ్రహం మీద ఉన్న వాతావరణం, అక్కడి అయస్కాంత క్షేత్రాలు, రేడియేషన్ తదితరాలపై సమాచారాన్ని తెలుసుకోవడానికి దీన్ని తయారుచేశారు.
1962, జూలై 22న దీన్ని ప్రయోగించారు. మొదట్లో అంతా సరిగానే నడిచింది. తర్వాత రాకెట్ ప్రయాణించాల్సిన దిశ మారింది. అదలాగే కొనసాగితే.. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో నౌకలు అధికంగా తిరిగే ప్రదేశంలో పడే ప్రమాదం ఉంది. దీంతో రేంజ్ సేఫ్టీ ఆఫీసర్ దాన్ని ధ్వంసం చేయడానికి కమాండ్ ఇచ్చారు. ప్రయోగించిన 294 సెకన్ల తర్వాత మెరైనర్–1ను గాల్లోనే పేల్చేశారు.
గీత మారిందిలా..
ఈ వైఫల్యానికి కారణంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. చివరికి ఓ చిన్న గీత.. మొత్తం అంతరిక్ష నౌక అదృష్ట గీతనే మార్చేసిందని తేల్చారు. రాకెట్ దిశను నిర్దేశించే సాఫ్ట్‌వేర్‌లో ఓవర్‌బార్(పైన రాసే గీత) మిస్ చేయడం వల్ల ఇది జరిగిందని గుర్తించారు. ఒక ఈక్వేషన్‌లో రేడియస్‌కు ఖకు బదులు ఖవచ్చింది. అంతే.. రాకెట్ దిశ మారిపోయింది. దీని వల్ల నాసా ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకుంది.
ఈ ప్రయోగం కోసం ఖర్చు పెట్టిన రూ.160 కోట్లు పోవడం సంగతి పక్కనపెడితే.. కోడింగ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఉపగ్రహ ప్రయోగాల్లో చేసే చిన్నపాటి తప్పులు మొత్తం మిషన్ వైఫల్యానికి ఎలా దారి తీస్తాయన్నది తెలుసుకుంది. అయితే, మెరైనర్–1 వైఫల్యం భవిష్యత్ ప్రయోగాలకు బాగా పనికివచ్చింది. తదుపరి మిషన్లన్నిటిలోనూ ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం అన్నది పరిపాటిగా మారింది.
– సాక్షి సెంట్రల్ డెస్క్