
అమెరికా–భారత్ వాణిజ్య విధానాలపై కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా
నోబెల్‌కు భారత్ నామినేట్ చేయకపోవడం వల్లే సుంకాలని ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు. భారత్‌పై భారీ సుంకాలు విధించి దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నాశనం చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చేసిన కృషి ఒక్క సుంకాల వల్ల తుడిచి పెట్టుకుపోయిందన్నారు. అరుదైన అత్యవసర పరిస్థితి అంటూ హెచ్చరించారు. పాకిస్తాన్ చేసినట్లుగా, తనను నోబెల్ శాంతి బహుమతికి భారత్ నామినేట్ చేయనందునే ట్రంప్ అలా చేస్తున్నారని ఆరోపించారు. ‘నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడానికి మోదీ నిరాకరించారు.
దీంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన 30 ఏళ్ల కృషిని నాశనం చేశారు. చైనా కంటే భారతదేశంపై ఆయన 50% ఎక్కువ సుంకాలను విధించారు. ఇవి బ్రెజిల్, చైనా కంటే ఎక్కువ’ అని ఖన్నా పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు భారత్‌ను చైనా, రష్యాల వైపు నడిపిస్తున్నాయనే అనేక మంది మాజీ దౌత్యవేత్తలు, అధికారుల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. సుంకాలు అమెరికాలోకి భారత తోలు, వస్త్ర ఎగుమతులను, అలాగే అమెరికన్ తయారీదారుల నుంచి భారత్‌లోకి ఎగుమతులను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ అమెరికన్లు స్పందించాలి...
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్లే భారత్‌పై సుంకాలు విధించినట్టు ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. సుంకాలకు నోబెల్ కోణమే ప్రధానమని భావిస్తున్నారు. భారత్‌తో సంబంధాన్ని నాశనం చేసే ట్రంప్ అహంకారాన్ని అమెరికా అనుమతించబోదని, భారతీయ అమెరికన్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయ అమెరికన్లందరూ ఇప్పుడు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. ట్రంప్‌కు తాను ఓటు వేయలేదని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా చేసిన పోస్ట్‌ను కూడా షేర్ చేస్తూ ఖన్నా తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఆయనకు నోబెల్ వస్తే ఆ తరువాత నోబెల్ ఎవరికిచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది అపవిత్రం అవుతుంది’ అని వినోద్ ఖోస్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.