అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు! | Recession Warnings In USA | Sakshi
Sakshi News home page

అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!

May 10 2025 12:52 PM | Updated on May 10 2025 1:38 PM

Recession Warnings In USA

దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్‌ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్‌తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట.  దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు  రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.

లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే 
ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో  పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి  పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని  వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక  నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.

దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది.  
-సిమ్మాదిరప్పన్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement