వాషింగ్టన్ డీసీ: యుద్ధాన్ని ముగించడం, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “ఇవాళ ఉదయం అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారని నేను ధ్రువీకరిస్తున్నాను. సమావేశం ఇంకా కొనసాగుతుండవచ్చు, లేక ముగిసి ఉండవచ్చు. ప్రతిపాదనపై చర్చ జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారని నేను చెప్పను. ఈ ఉదయం చర్చ జరిగింది అని మాత్రమే చెబుతాను. దీనిపై ముందుగా వివరాలు చెప్పదలచుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే అధ్యక్షుడు స్వయంగా మాట్లాడతారు” అని ఆమె చెప్పారు.
మూడోసారి పాక్‌కు అబ్బాస్ అరాఘ్చీ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌కు చేరుకున్నారు. అమెరికాతో ఘర్షణను ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య చర్యల్లో భాగంగా ఆయన ఇస్లామాబాద్‌కు రావడం 48 గంటల్లో ఇది మూడోసారి.
అబ్బాస్ అరాఘ్చీ అంతకుముందు రష్యాలో కార్యక్రమాలు ముగించుకున‍్నారు. అరాఘ్చీ ఇస్లామాబాద్ తాజా పర్యటన రష్యా, ఒమాన్ సహా పలు దేశాల్లో ఉన్నతస్థాయి సమావేశాల తర్వాత జరిగింది. పాకిస్థాన్‌కు ఆయన పదేపదే రావడం ప్రస్తుత పరిస్థితిలో శాంతికి మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పాత్రను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అరాఘ్చీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చ జరిగింది. కాగా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలో నిర్వహించాలని షరతు పెట్టింది.


