న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.
యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్‌కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో
ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్‌గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్‌లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు.


