
ఐరాస వేదికపై ధ్వజమెత్తిన భారత్
ఐక్యరాజ్యసమితి: సమయం, సందర్భం కాకపోయినా కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ మరోసారి దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జూలై నెల సమావేశంలోభాగంగా మంగళవారం ‘‘బహుళత్వం ద్వారా అంతర్జాతీయ శాంతిభద్రత ప్రోత్సాహం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ తొలుత ప్రసంగించింది.
ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఉపప్రదాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రసంగించారు. ‘‘కశ్మీర్‌ను భారత్ ఆక్రమించింది. తాజా ఉద్రిక్తతలను అడ్డంపెట్టుకుని సిందూ నదీజలాల ఒప్పందం అమలును భారత్ రద్దుచేసింది. కశ్మీర్‌సహా భారత్‌తో నెలకొన్ని ప్రతిష్టంభనకు అంతర్జాతీయ జోక్యం తప్పనిసరి’’అని ఇషాక్ దార్ అన్నారు. ఈయన వ్యాఖ్యలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దీటుగా బదులిచ్చారు.
‘‘బాధ్యతాయుతంగా ఉంటూ ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్‌కృషిచేస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదనే అంతర్జాతీయ ప్రాథమిక సూత్రాన్ని భారత్ పాటిస్తోంది. ప్రజాస్వామ్య పథంలో పైపైకి దూసుకెళ్తూ, ఆర్థిక శక్తిగా అవతరిస్తూ, బహుళత్వానికి, సామాజిక సమ్మిళిత వృద్ధిని సాధిస్తూ భారత్ బిజీగా ఉంటే ఉగ్రవాదం, మతోన్మాదం, అంతర్జాతీయ ద్రవ్యనిది సంస్థ(ఐఎంఎఫ్) వంటి చోట్ల వేల కోట్ల రుణాలుచేస్తూ పాకిస్తాన్ బిజీగా ఉంది’’అని హరీశ్ దెబ్బిపొడిచారు. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ 2.1 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరుచేసిన విషయం తెల్సిందే. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులే పహల్గాంలో పాశవిక హత్యాకాండకు తెరలేపారు’’అని హరీశ్ గుర్తుచేశారు.