గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్‌కు పాక్ ఆశ్రయం | Pakistan Secretly Shielded Iranian Jets from US Strikes | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్‌కు పాక్ ఆశ్రయం

May 12 2026 11:13 AM | Updated on May 12 2026 11:28 AM

Pakistan Secretly Shielded Iranian Jets from US Strikes

ఇస్లామాబాద్‌: అమెరికా-ఇరాన్ యుద్ధంలో శాంతిదూతగా, మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ భారీ మోసానికి పాల్పడిందా? అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ తన గడ్డపై రహస్యంగా ఆశ్రయం కల్పించిందని తాజాగా అమెరికన్ అధికారులు వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. సీబీఎస్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నూర్ ఖాన్ బేస్‌లో ఇరాన్ విమానాలు
ఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే, ఇరాన్‌కు చెందిన పలు విమానాలు పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిఘా సమాచారాన్ని సేకరించే ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఆర్సీ-130 (ఆర్‌సీ-130) విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్‌లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని వారు ఈ వార్తలను కొట్టిపారేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోనూ రహస్య ఆశ్రయం?
కేవలం పాకిస్తాన్‌లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్‌లో దిగిందని ఆఫ్ఘన్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఎలాంటి ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్‌కు అలా చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా సెనేటర్ ఫైర్
ఈ సంచలన నివేదికపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాక్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్‌కు, దాని మిత్రదేశమైన చైనాకు దూరం కాకుండా పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement