ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్‌పైనే ఉంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో "ఐరన్ ఎస్కార్ట్" ఏర్పాటు చేస్తోంది.
మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు (శనివారం) అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.
అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్‌ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు.
ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్ డెలిగేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను లాక్‌డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్‌ఫైర్ ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.


