
200 మంది తాలిబాన్ ఫైటర్లను హతమార్చామన్న పాక్
58 మంది పాక్ సైనికులను చంపేశామన్న అఫ్గాన్ సర్కార్
ఇస్లామాబాద్/పెషావర్: తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి.
200 మందికిపైగా తాలిబాన్ ఫైటర్లను అంతంచేశామని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం ప్రకటించగా తాము 58 మంది పాక్ సైనికులను చంపేశామని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు చెందిన 25 ఆర్మీ పోస్ట్‌లను సైతం దాడులను ధ్వంసంచేశామని అఫ్గాన్ సర్కార్ వెల్లడించింది. తమ దాడుల ధాటికి 30 మంది పాక్ సైనికులు రక్తమోడారని వెల్లడించింది.
ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ మాట్లాడారు. ‘‘ మా అఫ్గాన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌లో తలదాచుకున్న ఐఎస్‌ఐఎస్ ముఖ్యులను మాకు అప్పగించాలి. ఐఎస్‌గ్రూప్ ఒక్క అఫ్గానిస్తాన్‌కే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పు’’ అని ముజాహిద్ అన్నారు.
సరిహద్దు వెంట కాల్పుల మోత
‘ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ పరిధిలోని బరా మ్చాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, డిర్, చిత్రాల్‌లోని పాక్ ఆర్మీ పోస్ట్ లపై మా బలగాలు దాడులుచేశాయి. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ పోస్ట్‌లపై తెగబడి పలువురు పాక్ సైనికులను చంపేశాం’ అని ముజాహిద్ వివరించారు.