
కైరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం (అక్టోబర్ 11న) జరిగిన ఘోర కారు ప్రమాదంలో కతార్‌కు చెందిన ముగ్గురు కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అక్టోబర్ 13న ఈజిప్ట్‌లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు కతార్ దేశాధినేతకు సేవలందించే అమిరీ దివాన్(Amiri Diwan) కార్యాలయానికి చెందిన ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి’అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి.
ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్ట్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ 6న, అక్టోబర్ 7న రెండోసారి చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపు, బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 13న ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది.
కతార్ రాయబారుల మరణంతో శాంతి చర్చల్లో కలకలం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయ దౌత్యపరంగా కలకలం రేపుతోంది. శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోనున్నాయనే అంతర్జాతీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశముంది.
మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నాయి. అయితే, ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా? లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా? అన్నది సమయం చెప్పాలి.